
అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్
జనగామ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లాలో మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య ఆదేశించారు. మెడికల్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన, తదితర విషయాలపై క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. మెడికల్ విద్యార్థులకు తరగతి గదులు, వసతి గృహాలు, పరిపాలన విభాగం తదితర పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాలతో పాటు తాత్కాలికంగా ఏర్పా టు చేస్తున్న భవనాలను ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సమీక్షలో మెడికల్ కాళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాలరావు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మహేందర్, ఆర్‌డీఓ మధుమోహన్, మెడికల్ విభాగం ఇంజనీరింగ్ సిబ్బంది దేవేందర్, తహసీల్దార్ రవీందర్ పాల్గొన్నారు.
ఈవీఎంల పరిశీలన
జనగామ రూరల్: కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం గోదాంలో ఉన్న ఈవీఎంలను ఆదివారం కలెక్టర్ శివలింగయ్య పరిశీలించారు. ఈసీఎల్ కంపెనీ ఇంజనీర్లు వీవీ ప్యాట్ పని తీరును తనఖీ చేశారు. ఎన్నికల పర్యవేక్షకులు గంగా భవాని, డీటీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సమీక్షలో కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య