కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ(నాచుపల్లి)లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని మూడు నిమిషాలు ఆలస్యంతో పరీక్ష కేంద్రానికి హాజరుకావడంతో సిబ్బంది అనుమతించలేదు. వెంట వచ్చిన తల్లి సెక్యూరిటీ సిబ్బంది కాళ్లపై పడి తన బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుందని, లోపలికి పంపించాలని వేడుకుంది. తమ చేతుల్లో ఏమీలేదని, నిబంధన ప్రకారం నడుచుకుంటున్నామని సిబ్బంది తెలిపారు. కళాశాలలో రెండు కేంద్రాలు, ఎస్‌కేఎన్‌ఆర్ (ప్రభుత్వ) కళాశాలలో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. జేఎన్‌టీయూతోపాటు ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలలో 870 మందికి గాను 690 మంది పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. జేఎన్‌టీయూలో ఇన్‌చార్జిగా తిరుపతమ్మ, జగదీష్ వ్యవహరించారు.


