జగిత్యాలటౌన్: ఎల్‌నినో హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడితే రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే భయంతోనే సీఎం రేవంత్ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు అంటూ కొత్త ఎత్తులు వేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. 152 మీటర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని 148 మీటర్లకు ఇరు రాష్ట్రాల మధ్యం ఒప్పందం కుదిరిన విషయం తెలిసి కూడా కాలయాపన కోసమే 150 మీటర్ల ఎత్తు అంటూ కొత్త కుట్రకు తెరతీస్తున్నారని విమర్శించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొచ్చి 30నెలలు గడిచి, మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు తుమ్మడిహట్టి పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఆయన కుటుంబ ఆర్థిక లబ్ధి కోసమే ఫోర్త్ సిటీ అంటున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం గాలికొదిలేశారని తెలిపారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం.. కేసీఆర్‌ను దోషిగా చూపెట్టడం తప్ప మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు. మేడిగడ్డ కుంగిపోయి 30నెలలు గడుస్తుంటే రేవంత్‌రెడ్డి ఇప్పుడు నిద్రలేచాడని అన్నారు. మేడిగడ్డకు మరమ్మతు చేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఎందుకు పునరుద్ధరణ చేపట్టలేదని ప్రశ్నించారు. ఎల్‌నినో హెచ్చరికలతో వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడి తెలంగాణ ఎడారిగా మారితే దోషిగా నిలవాల్సి వస్తుందన్న భయంతోనే ఎత్తు పెంపు బాధ్యత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిదే అంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టు 152మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్‌ను ఒప్పించాలని కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య జరిగే ఒప్పందంలో కేంద్రమంత్రి పాత్ర ఏముంటుందని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డిని బూచిగా చూపి మరింత కాలయాపనకు రేవంత్ కుట్ర చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. మాయమాటలు మానుకుని రాష్ట్రంలో తాగు, సాగునీటి కష్టాలు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, హరిచరణ్‌రావు, గాజుల రాజేందర్, దేవేందర్‌నాయక్, సాగర్‌రావు, సింగరావు తదితరులు పాల్గొన్నారు.
జాప్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు కొత్త డ్రామాలు
ప్రజల దృష్టి మరల్చేందుకు ఎత్తు పేరుతో కొత్త పల్లవి
రేవంత్‌కు ఫోర్త్ సిటీపై ఉన్న శ్రద్ధ ప్రజాసంక్షేమంపై లేదు
రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడితే రేవంత్‌దే బాధ్యత
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి


