కథలాపూర్: ప్రజల్లో రాజకీయ చైతన్యం తేవడానికి సీపీఐ కృషి చేస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం అన్నారు. మండలంలోని గంభీర్‌పూర్, ఊట్‌పెల్లి, పెగ్గెర్ల, భూషణరావుపేట గ్రామాల్లో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల, కర్షకుల ఉద్యమాలకు సీపీఐ నేతృత్వం వహించి వారి హక్కుల సాధనకు పోరాటాలు చేశామన్నారు. అప్పట్లో నిజాం పాలకులపై ఉద్యమాలు చేసి గ్రామ రాజ్యాలు స్థాపించిన ఘనత సీపీఐదేనన్నారు. బీడీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలు చేసి వారికి జీవనభృతి, కనీస వేతనాలు సాధించడంలో సఫలీకృతమయ్యామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సభ్యుడు సుతారి రాములు, నాయకులు రాధక్క, వంశీ, కర్నె భూమయ్య, చెన్నవేని దశరథం పాల్గొన్నారు.


