కోరుట్ల: జిల్లాలో ఆస్తి పన్న వసూళ్లలో కోరుట్ల మున్సిపల్ టాప్‌గా నిలిచిందని మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ, పట్టణంలో ఆస్తి పన్ను వసూళ్ల డిమాండ్ రూ.5.70 కోట్లు కాగా, రూ.5.28 కోట్లు వసూలు అయ్యాయని తెలిపారు. మొత్తం 94.45 శాతం వసూళ్లతో కోరుట్ల జిల్లాలో అగ్రగామిగా, రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. పన్ను వసూళ్లలో కమిషనర్ రవీందర్‌తో పాటు ఉద్యోగుల సమష్టి కృషి ఉందన్నారు. మొదటి స్థానంలో నిలిచేందుకు ప్రజల సహకారం కీలకమన్నారు. ఆస్తిపన్ను వసూళ్లతో టాప్‌గా ఉన్న కారణంగా పట్టణానికి ప్రోత్సాహకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.3 నుంచి రూ.5 కోట్ల ప్రత్యేక గ్రాంట్ వచ్చే అవకాశం ఉందన్నారు. సదరు నిధులు మంజూరైతే ప్రజలకు ఉపయోగకరమైన రీతిలో సద్వినియోగం చేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావు సూచనలతో పట్టణంలోని అన్ని వార్డులను సమదృష్టితో చూసి నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా సహకరించి ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇవ్వాలని కోరారు. త్వరలోనే పట్టణంలోని మినీట్యాంక్ బండ్‌ను బాగు చేసి చెరువులో బోటింగ్ సౌకర్యం పునరుద్ధరిస్తామన్నారు. వేసవిలో పిల్ల లకు అందుబాటులో ఉన్న పార్కును పూర్తి స్థాయిలో బాగు చేయిస్తామని వివరించారు.


