నాన్నా... నాకూ ఆడుకోవాలనుంది
కరీంనగర్: తన తోటి పిల్లలు ఆడుకుంటుంటే ‘నాన్నా.. నాకు కూడా ఆడుకోవాలని ఉంది’.. అన్న ఓ చిన్నారి మాటలు.. ఆ తండ్రి గుండెను పిండేశాయి. ఆ మాటలకు మౌనంగా రోదించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఇది ఒక్క రోజు వేదన కాదు.. ఆ బిడ్డను చూస్తున్న ప్రతిసారి ‘నేనేమీ చేయలేకపోతున్నానే’ అని ఆ తండ్రి ఆవేదన. పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో బాధపడుతున్న బాలికకు ఆపరేషన్ కోసం రూ.6 లక్షలు అవసరం ఉంది. హమాలీ కార్మికుడైన తండ్రి తన శక్తి మేర చికిత్స చేయిస్తున్నా, దాతల సాయం కోసం ఎదురుచూడడం తప్ప తను అంత ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. వివరాలు.. కరీంనగర్‌లోని హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన హమాలీ కార్మికుడు మోతె హరీశ్, శ్రీలత దంపతుల జీవితం నిత్య పోరాటం. రోజూ కష్టపడితే తప్ప కడుపునిండని దుస్థితి. ఈ పేదరికానికి తోడు పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో జన్మించిన తమ పెద్ద కుమార్తె సిరిచందన (14)ను కంటికి రెప్పలా పెంచుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా, 12 ఏళ్లు వచ్చే వరకు శస్త్రచికిత్స సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. అయితే తోటి పిల్లలలాగే తాను లేననే బాధతో ఆ చిన్నారి పాఠశాలకు సైతం సరిగా వెళ్లలేకపోతుంది. 12 ఏళ్ల వయసు పూర్తయినా ఆపరేషన్‌కు కావాల్సిన లక్షల రూపాయల ఖర్చు వారికి అడ్డంకిగా మారింది. ఆపరేషన్‌కు వైద్యులు సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. పేదరికంలో జీవిస్తున్న ఆ కుటుంబానికి అది తలకు మించిన భారమే. అయినా తండ్రి వెనకడుగు వేయలేదు. చిన్నారి చికిత్స కోసం అప్పులు చేస్తూ, సాయం కోసం తలుపు తడుతూ ముందుకు సాగుతున్నాడు. ప్రజాప్రతినిధుల వద్దకూ వెళ్లినా ఇప్పటివరకు ఆశించిన స్పందన ఎక్కడా రాలేదు. రెండేళ్లుగా ‘ఎవరైనా దయగల హృదయులు స్పందిస్తారా?’ అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. తన కూతురు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటే చూడాలన్న తండ్రి కల ఇంకా కలగానే ఉంది. చిన్నారి భవిష్యత్తు ఒక శస్త్రచికిత్సపై ఆధారపడి ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి స్పందన ఆమెకు కొత్త జీవితం ఇవ్వగలదు. దాతలు చేసే సాయం బాలిక జీవితాన్ని నిలబెట్టగలదు. స్పందించే దాతలు 99480 55713 నంబర్‌కు ఫోన్‌పే/గూగుల్ పే ద్వారా లేదా ఫోన్‌లోనైన తమను సంప్రదించాలని హరీశ్ వేడుకుంటున్నాడు.
బాలికకు పుట్టుకతో వెన్నెముక సమస్య
శస్త్ర చికిత్స కోసం చిన్నారి ఎదురుచూపు


