సమన్వయంతో ఎన్నికలు విజయవంతం
జగిత్యాల: అధికారుల సమన్వయంతోనే పంచాయతీ ఎన్నికలు విజయవంతం అయ్యాయని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం అన్ని శాఖల అధికారులు కలెక్టర్‌ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి పూర్తయ్యే వరకు మూడు దశల్లో ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు.
గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి
2027 జూలైలో గోదావరి పుష్కరాలను కుంభమేళాగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. లక్షలాది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు వస్తారని, తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒకే రోజు 2 లక్షల మంది పుష్కరఘాట్లకు తరలివచ్చినా ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
జగిత్యాల మున్సిపాల్టీలో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ శుక్రవారం కలెక్టర్ సత్యప్రసాద్‌ను కోరారు. అభివృద్ధి పనుల్లో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, డబుల్‌బెడ్‌రూం వద్ద మౌలిక వసతులు కల్పించేలా చూడాలన్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీపీవో రఘువరణ్, ఆర్డీవో మధుసూదన్, కన్నెం హారిణి, మోహన్, కలెక్టరేట్ ఏవో హకీం పాల్గొన్నారు.


