యువతరానికే పట్టం
జగిత్యాల: గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అలాంటి పల్లెల్లో గతంలో సర్పంచులుగా పోటీ చేయాలంటేనే ప్రతిఒక్కరూ భయాందోళనకు గురయ్యేవారు. గ్రామాల్లో పెత్తనం చేసేవారే ఎక్కువగా పోటీచేసే వారు. పరిస్థితులు మారాయి. యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి సై అంటోంది. గతంతో పోల్చితే ఈ సారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో యువతే ఎక్కువగా బరిలో నిలిచింది. ప్రజలు కూడా వారినే ఆదరించారు. జిల్లాలో 385 గ్రామ పంచాయతీలు, 3,536 వార్డులు ఉన్నాయి. ఇందులో దాదాపు 90 శాతం మంది 40 ఏళ్లలోపు వారే బరిలో నిలిచి విజయం సాధించారు. గ్రామీణ ప్రజలు కూడా మార్పు కోరుకుంటూ యువతకు పట్టంకట్టారు. వీరిలో చాలామంది అండర్‌గ్రాడ్యుయేట్లు 200 మంది వరకు.. గ్రాడ్యుయేట్లు దాదాపు 45మందికి పైగానే ఉన్నారు. పోస్ట్‌గ్రాడ్యుయేట్లు 12 మంది ఉన్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు.. ప్రైవేటు ఉద్యోగాలు వదిలి పంచాయతీ బరిలో నిలిచి సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు, మద్యం ఏరులై పారినప్పటికీ తామేం తక్కువ కాదంటూ యువత ముందుకొచ్చి మొత్తానికి పోటీలో నెగ్గారు.
సమస్యలతోనే స్వాగతం..
గ్రామీణ ప్రాంతాల్లో గత పాలకవర్గం ముగిసి రెండేళ్లయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేకపోయింది. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అయితే గెలిచిన సర్పంచులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలోని అనేక గ్రామాల్లో రోడ్లు, వైకుంఠదామాలు, మురికికాలువలు అధ్వానంగా మారాయి. పాఠశాలలు, కమ్యునిటీ హాల్స్, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక ఇబ్బందిగా ఉంది. వాస్తవానికి గ్రామాల్లో ప్రధానమైన సమస్య కోతులు, కుక్కల బెడద. ఎక్కడ చూసినా వాటి సంచారం అత్యధికంగా ఉంది. వీటిని నిర్మూలించే బాధ్యత కొత్త సర్పంచులపై ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని పెంకుటిళ్లు కోతులతో దాదాపుగా చెడిపోయాయి. వీధికుక్కలు గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. కనిపించిన చిన్నపిల్లలు, వృద్ధులను కాటేస్తున్నాయి. వీటి నివారణకు కొత్త పాలకవర్గం చర్యలు చేపట్టాల్సి ఉంది. పశువైద్యం అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరో ప్రధాన సమస్య వీధిలైట్లు. చాలాచోట్ల ఏర్పాటు చేసినప్పటికీ ఎక్క డా వెలగడం లేదు. వీధి దీపాలు బిగించిన వారంవెలుగుతున్నాయి. తర్వాత ఎగిరిపోతున్నాయి. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కాలనీలన్నీ చీకటిమయంగానే మారాయి. గత పాలకవర్గం హయాంలో పనులు చేసినప్పటికీ బిల్లులు రాక అనేకమంది కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్లు రాని వారికి, వృద్ధులకు సంబంధించిన సమస్యలు, మహిళల సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ సమస్యలన్నీ కొత్త సర్పంచులకు భారంగా మారనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్ల కొనుగోలు చేశారు. వాటి నెలవారి అద్దెలు బ్యాంకుల్లో కట్టలేక ట్రాక్టర్లు మూలనపడ్డాయి. వాటిని వినియోగంలోకి తేవాల్సి ఉంది.
కొత్త పాలకవర్గాలు ఏర్పాటు
గ్రామపంచాయతీ మూడు విడతల ఎన్నికలు ముగియగా.. మరో 4–5 రోజుల్లో పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరుడు కావడంతో గ్రామంలోని సమస్యలను చూడాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. మరో 2–3 రోజుల్లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
యువతరానికే పట్టం
యువతరానికే పట్టం


