కుట్రపూరిత రాజకీయాలతో వేధింపులు
జగిత్యాల: నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలతో ఈడీ దాడులతో సోనియాగాంధీ, రాహూల్‌గాంధీని వేధిస్తోందని, ఢిల్లీ హైకోర్టు తీర్పుతోనైనా బీజేపీకి కనువిప్పు కలగాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం ఇందిరాభవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన కుటుంబాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా వేధిస్తున్నారని, ఢిల్లీ హైకోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. మహాత్మగాంధీ పేరిట కొనసాగుతున్న ఉపాధి పథకం పేరును మార్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య మాట్లాడుతూ.. భారతీయుల స్వేచ్ఛ, సమానత్వం కోసం నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారన్నారు. కాంగ్రెస్ నాయకులు కొత్తమోహన్, బండ శంకర్, మాజీ కౌన్సిలర్లు దుర్గయ్య, అనిత పాల్గొన్నారు.


