అక్కడ పులి.. ఇక్కడ అప్రమత్తం
మెట్‌పల్లిరూరల్: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కామారెడ్డి ప్రాంతంలోని దోమకొండ పాతతాలుకా పరిధిలో గల మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట, భిక్కనూర్ మండలాల్లో పెద్దపులి సంచరించి మూగజీవాలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల అడవుల నుంచి పెద్దపులి సిరికొండ, కమ్మర్‌పల్లి ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలోని అటవీ ప్రాంతం ద్వారా జిల్లాలోకి ప్రవేశిస్తుందేమోనన్న అనుమానంతో అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. మెట్‌పల్లి మండలంలోని రంగారావుపేట, కేసీఆర్‌తండా, పాటిమీది తండా, అందుబొందుల తండా, ఆత్మనగర్, ఆత్మకూర్ గ్రామాల్లో పంట పొలాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని గురువారం మైకుల ద్వారా చెప్పించారు. ఎక్కడైనా పులి కనిపించినా.. వాటి పాదముద్రలు కనిపించినా.. మూగజీవాలపై దాడులు చేసినట్లు ఆనవాళ్లు ఉన్నా.. తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాచారం ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న చోటు నుంచి ఇక్కడి అటవీప్రాంతానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరం ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పెద్దపులి రోజుకు సుమారు 50 కిలోమీటర్లు నడిచే అవకాశం ఉంటుందని భావిస్తున్న అధికారులు.. మధ్యలోనే దానికి కావాల్సిన ఆహారం దొరికితే ఆ ప్రాంతంలోనే ఉంటుందా..?లేక ఇటువైపు వస్తదా..? తిరిగి వెనక్కే వెళ్తుందా..? అనేది చూడాల్సి ఉందని, ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.


