నెలరోజులుగా కేంద్రాల్లోనే మక్కలు
కథలాపూర్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను విక్రయిద్దామంటే అన్నదాతలకు అష్టకష్టాలు తప్పడంలేదు. కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామశివారులో మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతామని రైతులకు సమాచారం ఇవ్వడంతో రైతులు మక్కలు పోశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్ధతు ధర రూ.2,400 వస్తుందని సుమారు నెల రోజుల నుంచి పెగ్గెర్ల, ఊట్‌పెల్లి గ్రామాల రైతులు పెగ్గెర్ల కొనుగోలు కేంద్రంలో మక్కలు పోసి ఆరబెడుతున్నారు. ఇప్పటికీ తూకం వేయడంలేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు కథలాపూర్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఎప్పటికప్పుడు తూకం వేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. పెగ్గెర్ల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ఇప్పటికి తూకం ప్రారంభించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. నిర్లక్ష్యం ఎవరిదో కానీ తాము కొనుగోలు కేంద్రంలోనే రోజులతరబడి నిరీక్షించాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


