సత్వర న్యాయం కోసమే ‘లోక్ అదాలత్’లు
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జగిత్యాలజోన్: కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకే జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. ఈనెల 21న జిల్లా కోర్టులో నిర్వహించే జాతీయ మెగా లోక్‌అదాలత్‌పై మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని కోర్టులో 17,074 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో సివిల్ 5,134, క్రిమినల్ కేసులు 11,940 ఉన్నాయని, ప్రతిరోజు కొత్త కేసులు వచ్చి చేరుతున్నాయని, తద్వారా కోర్టులపై కేసుల భారం పడుతోందని తెలిపారు. పెండింగ్ కేసులు తగ్గిస్తూ.. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని వివరించారు. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల కోర్టుల్లో 7,277 క్రిమినల్ కేసులు, 5,134 సివిల్ కేసులు రాజీకి అనుకూలంగా ఉన్నాయని, వీటిని ఈనెల 21న లోక్‌అదాలత్‌లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మోటార్ వాహనాల నష్టపరిహారం కేసులకు సంబంధించి ఇన్సూరెన్సు కంపెనీ ప్రతినిధులు, కంపెనీ లాయర్లు.. పోలీసు అధికారులతో సమావేశం అయినట్లు తెలిపారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ మాట్లాడుతూ కుటుంబ తగాదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలతో సాధించేది ఏమీ లేదని, వాటిని సామరస్యపూర్వకంగా లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ రాజీకి అనుకూలమైన అన్ని కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించనున్నట్లు వివరించారు.


