‘మూడోవిడత’కు భారీ బందోబస్తు
జగిత్యాలక్రైం: జిల్లాలో బుధవారం నిర్వహించే మూడోవిడత పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బందితోపాటు సామగ్రిని ఆయా ప్రాంతాలకు పోలీస్ బందోబస్త్ మధ్య తరలించామని తెలిపారు. బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాలలో మొత్తం 119 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 45 రూట్లలో సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, ఎస్సైలు, పెట్రోలింగ్ టీమ్స్ కలిపి 853 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లు సెల్‌ఫోన్‌లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్‌తో పోలింగ్ బూత్‌లోకి రావొద్దని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీలు దిగడం నిషేధమన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికలు ముగిసే వరకు కోడ్ అమలులో ఉంటుందని, విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాలు కాల్చడం, బైక్‌ర్యాలీలు, డీజేలు పూర్తిగా నిషేధమన్నారు.


