కలగానే ఉద్యాన పరిశోధన కేంద్రం
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల వ్యవసాయాధారిత జిల్లా కావడంతో వరి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలతో పాటు మామిడి, అరటి, బొప్పాయి, పసుపు తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇటీవల అభ్యుదయ రైతులు డ్రాగన్‌ప్రూట్, జామ, దానిమ్మ వంటి లాభదాయక పంటలు వేస్తున్నారు. కొత్తగా ఆయిల్‌పాం తోటలను దాదాపు 5 వేల ఎకరాల్లో సాగు చేశారు.అయితే, ఉద్యాన రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చే శాస్త్రవేత్తలు మాత్రం అందుబాటులో లేరు.
60 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు
జిల్లాలో దాదాపు 60 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. సుమారు 30 వేల ఎకరాల్లో మామిడి, బత్తాయి, అరటి, 6 వేల ఎకరాల్లో మిర్చి, టమాట, పసుపు వంటి వాణిజ్య పంటలను 25 వేల ఎకరాల్లో, గులాబీ, బంతి, చామంతి తోటలను 500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
హామీలన్నీ ఉత్తమాటలే..
వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని విడదీయడంతో ఇక్కడ పనిచేసే ఉద్యాన శాస్త్రవేత్తలు నిజమాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన కేంద్రానికి వెళ్లారు. అప్పటి నుంచి జిల్లాలో ఒక్క ఉద్యాన శాస్త్రవేత్త లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అప్పటి మంత్రి జీవన్‌రెడ్డి చల్‌గల్‌లోని ప్రదర్శన క్షేత్రంలో ఉద్యాన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో గల ఉద్యాన విశ్వవిద్యాలయ అధికారులు 2009 ఫిబ్రవరి 6న పరిశీలించి వెళ్లారు. అనంతరం వైఎస్సార్ మరణంతో ఆ ప్రతిపాదనలు ముందుకు కదలలేదు. తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోను ఉత్తర తెలంగాణలో వ్యవసాయాధికారులు, రైతులకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించగా, అదీ నెరవేర లేదు.
చల్‌గల్‌లో మామిడి పరిశోధన కేంద్రం
చల్‌గల్‌లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్‌ను ఆనుకుని స్థలం ఉండటంతో అందులో మామిడి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని స్వయనా అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదీ సైతం అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే ప్రదర్శన క్షేత్రంలో సపోట, మామిడి వంటి పండ్ల తోటలతో పాటు గులాబీ తోటలున్నాయి. ఉద్యాన పంటలపై పరిశోధనలకు ఈ ప్రదర్శన క్షేత్రం అనువుగా ఉంటుందని గతంలో వ్యవసాయ మంత్రులుగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డికి అన్ని పార్టీల నాయకులు విన్నవించినా ఫలితం లేదు.
ధారాదత్తం చేస్తుండడంపై ఆందోళన
చల్‌గల్ ప్రదర్శన క్షేత్రంలో 150 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ఇప్పటికే 20 ఎకరాలు మామిడి మార్కెట్, 5 ఎకరాలు రైల్వే లైన్‌కు, 6 ఎకరాలు మార్క్‌ఫెడ్ గోదాంలు, ఎకరం వరకు విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఇచ్చారు. మామిడి మార్కెట్‌లో షెడ్లు నిర్మిస్తున్నందున మరో 10 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం ఉన్న స్థలంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనైనా ఉద్యాన పరిశోధన కేంద్రం లేదా క్రిషి విజ్ఞాన కేంద్రం వస్తుందనే ఆశతో జిల్లా రైతులు ఉన్నారు.


