ఓట్ల వేటలో ‘పంచాయతీ’ అభ్యర్థులు
పెగడపల్లి: మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. సర్పంచ్, వార్డు సభ్యుల బరిలో ఉన్న అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. పెగడపల్లి మండలంలో 23 పంచాయతీలకు రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 216 వార్డుల్లో 52 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డుస్థానాలకు ఈనెల 17న ఎన్నికలు జరగనున్నాయి. మండలంలో 35,869 మంది ఓటర్లున్నారు. అత్యధికంగా బతికపల్లిలో 4,559 మంది, అత్యల్పంగా మ్యాకవెంకయ్యపల్లిలో 533 మంది ఓటర్లున్నారు. 21 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 91 మంది, 164 వార్డుల్లో 480 మంది పొటీ పడుతున్నారు.
ప్రతిష్టాత్మకంగా పెగడపల్లి, బతికపల్లి..
అన్ని పార్టీలూ మండలకేంద్రమైన పెగడపల్లితోపాటు బతికపల్లి సర్పంచ్ స్థానాలనే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మాజీమంత్రి జీవన్‌రెడ్డి స్వగ్రామమైన బతికపల్లి కాంగ్రెస్‌కు పెట్టిందిపేరు. ఇప్పటివరకు ఈ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ ఆధీనంలోనే ఉంది. ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో తన ఖాతాలో వేసుకోవాలని బీఆర్‌ఎస్ జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ శ్రేణులు కూడా పట్టు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెగడపల్లి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈసారి ఈ స్థానాన్ని ‘చే’జారిపోవద్దన్న రీతిలో కాంగ్రెస్.. తమ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్.. ఎలాగైనా గెలవాలని బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు కూడా ముమ్మరంగా ప్రచారం కొనసాగించారు. యువజన, కుల సంఘాలను తమ వైపు తిప్పుకునేందుకు ఓటర్లకు తాయిళాలు ప్రకటిస్తూ గెలుపు కోసం రహస్య మంతనాలు కొనసాగిస్తున్నారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు..
పోటీలో ఉన్న అభ్యర్థులందరూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఓటరు జాబితా ఆధారంగా ఇతర ప్రాంతాల్లోని వారిని రప్పించేందుకు పోన్లు చేస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఓటర్లకు మందు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు.


