ఓటమితో కుంగిపోవద్దు
● ఓడిన అభ్యర్థులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది ● పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
మల్లాపూర్: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలుపునకు పొంగిపోవద్దని, ఓటమికి కుంగి పోవద్దని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మండలంలోని ముత్యంపేట, సిరిపూర్, రత్నాపూర్ గ్రామాల్లో పర్యటించిన ఆయన ఓడిపోయిన బీఆర్‌ఎస్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. మల్లాపూర్, రాఘవపేటలో గెలిచిన సర్పంచ్‌లు చిట్యాల లక్ష్మణ్, తోట శ్రీనివాస్, వార్డుసభ్యులను సన్మానించారు. సర్పంచులు ప్రజలందరినీ కలుపుకొని గ్రామాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేయాలని సూచించారు. ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులకు పార్టీ అండగా ఉంటుందని, పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు కమిటీ జిల్లా మాజీ సభ్యుడు దేవ మల్లయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ముద్దం శరత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


