● కారు, మొబైల్‌ఫోన్ స్వాధీనం ● పెద్దపల్లి ఏసీపీ కృష్ణ వెల్లడి
ఓదెల(పెద్దపల్లి): పొత్కపల్లి గ్రామ శివారులో 4.098 కేజీల గంజాయి స్వాధీనం చేసు కున్నట్లు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తెలిపారు. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం వివరాలు వెల్లడించారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై రమేశ్ పొత్కపల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా ఓ కారు వచ్చిందన్నారు. అందులో తనిఖీ చేయగా.. కంసాని అరుణ్ వద్ద 4.098 కేజీల ఎండు గంజాయి లభిందని పేర్కొన్నారు. దాని విలువ సుమారు రూ.2.04 లక్షలు ఉంటుందని వివరించారు. కారుతోపాటు మొబైల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని వివరించారు. ఇదే కేసులో నిందితులు ఇల్లెందుకు చెందిన బొల్లెద్దు మహేందర్, చీమల ఆకాశ్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న సీఐ, ఎస్సైతోపాటు ఏఎస్సై రత్నాకర్, కానిస్టేబుళ్లు రాజుయాదవ్, హరీశ్, రాము, శివశంకర్, రాజేందర్, రాజు, రమేశ్‌ను అభినందించారు.
ఎన్టీపీసీ స్టేజ్–2కు పర్యావరణ అనుమతులు
జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎన్టీపీసీలో చేపట్టిన 2,400 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండోదశ పనులకు పర్యావరణ అనుమతులు లభించాయి. సుమారు ఎనిమిది నెలల క్రితం ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. పర్యావరణ క్లియరెన్స్ కోసం గత ఆగస్టు 26న ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నివేదికను సమగ్రంగా పరిశీలించిన అనంతరం పర్యావరణ అనుమతులను జారీ చేస్తూ భారత ప్రభుత్వ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్‌లైమేట్ చేంజ్ విభాగం అనుమతి జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం –2014 ప్రకారం బొగ్గు ఆధారిత 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఈక్రమంలో ఇప్పటికే 1,600 మెగావాట్ల ఒకటో దశ ప్రాజెక్టు నిర్మించింది. రెండోదశలో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు యూనిట్లను నిర్మించనున్నారు.
4.098 కిలోల గంజాయి స్వాధీనం