
దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్న బీజేపీ
● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య
గోదావరిఖని: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో భయానక పరిస్థితులు కల్పిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య విమర్శించార. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాల్లో దాడులు మొదలయ్యాయన్నారు. ఇది దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి ఓట్లు వేయని వారిని పౌరులుగా రుజువు చేసుకోవాలంటున్నారని, ఇది చాలా ప్రమాదకరమైన వాతావరణమన్నారు. ఇప్పటికే ఆ పార్టీకి ఓట్లు వేయరనే కారణంతో అనేకరాష్ట్రాలోని చాలామంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని, ఇప్పుడు బిహార్‌లో కూడా అదే జరుగుతోందని అన్నారు. దేశ పౌరులుగా రుజువు చేసుకోవడానికి బర్త్ సర్టిఫికేట్‌లేక అస్సాంలో 19 లక్షల మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఇదేపద్ధతి దేశం మొత్తం అమలు చేస్తే 2కోట్ల మంది పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిస్తారని తెలిపారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు క్యూలో నిలబడాల్సివస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదన్నారు. యూరియా నిల్వచేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో గురుకులాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడూ అదే ఉందన్నారు. దేవరకొండలో ఫుడ్ ఇన్ఫెక్షన్‌తో సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని తెలిపారు. నాయకులు వై.యాకయ్య, ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎ.మహేశ్వరి, ఎం.రామాచారి, మెండె శ్రీనివాస్ పాల్గొన్నారు.