
ఎండుతున్న నారుకు బిందెలతో నీళ్లు
● మరమ్మతుకొచ్చిన ట్రాన్స్‌ఫార్మర్ ● కరెంట్ లేక నీరుపెట్టని రైతు ● స్పందించిన మంత్రి అడ్లూరి
గొల్లపల్లి: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుకు రావడంతో ఓ రైతు నారుమడి ఎండిపోయింది. దీంతో సదరు రైతు నారుమడికి బిందెలతో సోమవారం నీళ్లు పోయించాడు. ఈ ఘటన మండలంలోని రంగదామునిపల్లిలో చోటుచేసుకుంది. తిర్మాలాపూర్‌కు చెందిన ఓ రైతుకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ ఐదురోజుల క్రితం మరమ్మతుకు వచ్చింది. విద్యుత్ అధికారులు దానిని మరమ్మతుకు పంపించారు. వర్షాలు లేకపోవడం.. ట్రాన్స్‌ఫార్మర్‌ను సకాలంలో తెప్పించకపోవడంతో నారు ఎండుతోంది. దానిని కాపాడుకునేందుకు సదరు రైతు తన కుటుంబసభ్యులతో బిందెలతో నీరు తెప్పించి చల్లించాడు. దీనిని గమనించిన కాంగ్రెస్ నాయకుడు జెల్ల అనిల్‌కుమార్ విషయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సిబ్బంది రెండుగంటల వ్యవధిలో ట్రాన్స్‌ఫార్మర్ బిగించారు. దీంతో రైతు తన నారుమడికి మోటార్ సహాయంతో నీరు పెట్టాడు.

ఎండుతున్న నారుకు బిందెలతో నీళ్లు