● రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకా..? ● అన్నివర్గాలను నిండా ముంచినందుకా..? ● గతంలో రెండుసార్లు రైతు భరోసా ఎగవేతకా..? ● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: రైతు భరోసా ఇచ్చామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకా..? అన్ని వర్గాల ప్రజలను నిండా ముంచినందుకా..? ఎందుకు సంబరాలు అని ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. రెండుసార్లు రైతుభరోసా ఎగవేశారని, ఇంకా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని, రైతుకూలీలకు రూ.12వేలు, కౌలు రైతులకూ రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ అరకొరగానే ఇచ్చారని, ఇప్పుడు కూడా అందరికి కాకుండా కొందరికే రైతుభరోసా ఇచ్చి తామేదో సాధించామంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. 519 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పట్టించుకోవడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎళ్లప్పుడు నీరందించాలనే దృఢ సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్ట్ నిర్మించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక చెక్‌డ్యామ్, చెరువు, ఒక ప్రాజెక్ట్ నిర్మించారా అని ప్రశ్నించారు. సీఎంకు బనకచర్ల, దేవాదుల ప్రాజెక్ట్, గోదావరి, కృష్ణ బేసిన్‌లు ఎక్కడున్నాయో కూడా తెలియదన్నారు. గోదావరి నీటిని చంద్రబాబుకు అప్పగించడంలో భాగంగా ప్రజల దృష్టి మళ్లించడానికే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్ జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చేసిందేమీ లేదన్నారు. కేంద్ర మంత్రి సంజయ్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను వక్రీకరించి తుమ్మడిహట్టి ద్వారా నీళ్లు వస్తాయని చెబుతున్నారని, కేంద్రం నుంచి 152 మీటర్ల ఎత్తుతో పర్మిషన్ తీసుకొస్తే సన్మానం చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి పిచ్చిమాటలు, బూతుమాటలు మానుకుని బనకచర్ల ప్రాజెక్ట్ గురించి పోరాటం చేయాలన్నారు. వెంటనే రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా, రుణమాఫీ ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, సాయిరెడ్డి, రాజేశ్ పాల్గొన్నారు.