
మామిడికాయ పచ్చడి విషయంలో గొడవ
● భార్యను గొంతు నులిమి చంపిన భర్త
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మామిడికాయ పచ్చడి పెట?్ట విషయంలో తలెత్తిన గొడవలో భార్యను గొంతు నులిపి చంపాడు భర్త. ఈ ఘటన పందిళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర అంజలి– సూర రాజ్‌కుమార్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం మామిడికాయ పచ్చడి పెట్టేందుకు అంజలి సన్నద్ధమైంది. ఇందుకోసం అవసరమైన వెల్లుల్లి కొనుక్కు రావాలని భర్త రాజ్‌కుమార్‌కు సూచించింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్.. అంజలి(27)ను గొంతు నులిమి చంపేశాడు. ఈమేరకు మృతురాలి తండ్రి సంపంగి మల్లేశ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు శవాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
రామగిరి(మంథని): కల్వచర్ల గ్రామానికి చెందిన వేముల లింగయ్య(90) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రకుమార్, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం .. లింగయ్య భార్య పద్మ కొంతకాలం క్రితం మరణించడంతో లింగయ్య ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి తన ఐదో కుమారుడు ఇంట్లో భోజనం చేయాలని అడుగగా తినకుండా వెళ్లి పడుకున్నాడు. సోమవారం ఉదయం బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి తలుపుతీయగా రేకులషెడ్డు కర్రకు ఉరి వేసుకుని ఉన్నాడు. తమ తండ్రి ఒంటరిగా ఉండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి పెద్ద కుమారుడు వేముల కుమార్‌స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
భర్తను చితకబాదిన భార్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బిడ్డను తీసుకెళ్తున్నాడని ఆగ్రహించిన భార్య.. భర్తపై దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట పరిధిలోని కిష్టునాయక్‌తండాకు చెందిన ధరావత్ స్వప్న(మమత), విజయవాడకు చెందిన సిద్ది నాగార్జునరెడ్డి కొన్నేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు అలేఖ్య జన్మించింది. నాగార్జునరెడ్డి మేసీ్త్ర పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు నెలలుగా ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలోనే నాగార్జునరెడ్డి మండల కేంద్రంలో ఉంటున్న తన భార్య వద్దకు వెళ్లి కూతురు అలేఖ్యను తనకు ఇవ్వమని గొడవకు దిగాడు. కూతురును లాక్కునే ప్రయత్నంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో స్వప్న తన భర్తపై రాయితో దాడి చేసింది. నాగార్జునరెడ్డి తన కూతురును తనకు ఇవ్వాలని రోడ్డుపై కూర్చున్నాడు. గ్రామస్తులు జోక్యం చేసుకుని మంగళవారం మాట్లాడడానికి నిర్ణయించారు.