
భాగ్యరెడ్డి వర్మ ఆదర్శం
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాలటౌన్: సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వర్మ 137వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానంలో దళిత బాలికల పాఠశాలను స్థాపించి వారి అభ్యున్నతికి పునాదులు వేశారని గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్‌కుమార్, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.
సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ
జగిత్యాలక్రైం: దళిత ఉద్యమానికి పునాది వేసిన గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డివర్మ అని అడిషనల్ ఎస్పీ భీంరావ్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన సేవలను గుర్తిస్తూ ఏటా మే 22న జయంతిని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వేణు, ఆర్‌ఎస్సై రమేశ్, డీపీవో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ధర్మపురిలో మారుమోగిన శ్రీరామ నామం
ధర్మపురి: హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీప్రసన్నాంజనేయ స్వామిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. స్వామివారికి వేదపండితులు క్షీరాభిషేకం చేశారు. అంజన్న మాలలు ధరించిన భక్తులంతా కొండగట్టు నుంచి ధర్మపురికి చేరుకున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ధర్మపురికి చెందిన గునిశెట్టి అంజన్న మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు పాల్గొన్నారు.
నృసింహుడి ఆదాయం రూ.8లక్షలు
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి గురువారం టికెట్లు, ప్రసాదాలు, అన్నదానం ద్వారా రూ. 8,18,480 వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు.
డీఎస్పీ రఘుచందర్ బదిలీ నిలిపివేత
జగిత్యాలక్రైం: ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఇందులో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ను ఇంటలీజెన్సీ డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రామగుండం సీసీఎస్ ఏసీపీగా పనిచేస్తున్న వెంకటస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా రఘుచందర్ బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
జూన్‌లో మహా చండీయాగం
జగిత్యాలటౌన్: జూన్ 14, 15న ఉద్యమకారుల మహా చండీయాగం చేపడుతున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి అన్నారు. జిల్లాకేంద్రంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుచేయాలని యాగం చేపడుతున్నామన్నా రు. తిమ్మాపూర్ మండలంలోని తాపాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో యాగం ఉంటుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి భారతపు లింగా రెడ్డి, ప్రేంకుమార్, వేణుగోపాల్, చినారెడ్డి, మల్లేశం, గాలిపెల్లి సత్తవ్వ, శంకర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర
జగిత్యాల: కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని, దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ వసంత అన్నారు. ప్రాజెక్టులో అవినీతి లేదని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ నాగరత్న బెంచ్ స్పష్టం చేసిందన్నారు. నీటి ప్రాజెక్ట్‌లు ప్రజాప్రయోజనాల కోసం చేపడతారని, ప్రాజెక్ట్‌లతో తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారని గుర్తు చేశారు. ఇది సుప్రీంకోర్టు సాక్షిగా రేవంత్‌రెడ్డి సర్కారుకు చెంప పెట్టు అన్నారు.

భాగ్యరెడ్డి వర్మ ఆదర్శం