
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరో ఇద్దరికి గాయాలు
సిరిసిల్లక్రైం/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలంలోని బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బంధువులు తెలిపిన వివరాలు. తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూరుకు చెందిన శనిగరపు దిలీప్(28) గజసింగవరంలోని తన బంధువుల వివాహ రిసెప్షన్‌కు ఆదివారం హాజరయ్యాడు. రాత్రి కావడంతో ఎల్లారెడ్డిపేటలోని బంధువుల ఇంట్లో నిద్రించాడు. సోమవారం తెల్లవారుజామున వేములవాడకు వెళ్తుండగా బైపాస్‌రోడ్డులోని మెడికల్ కాలేజీ వద్ద కల్వర్టులోకి బైక్ దూసుకెళ్లింది. దిలీప్ అక్కడికక్కడే మృతిచెందగా.. బైక్‌పై ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు దిలీప్ చనిపోవడంతో తల్లిదండ్రులు చంద్రయ్య, లక్ష్మి రోదనలు మిన్నంటాయి. దిలీప్ ఓ ప్రైవేట్ మైక్రోఫైనాన్స్‌లో ఉద్యోగం చేస్తుండేవాడని తెలిసింది.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
కోరుట్ల రూరల్: మండలంలోని మోహన్‌రావుపేటలో ఆదివారం రాత్రి దొంగలు తాళం వేసి ఉన్న ఇల్లలో దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన సింగు సురేశ్ రెండురోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు సురేశ్‌కు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరిన సురేష్ బీరువాలో దాచిపెట్టిన నాలుగు తులాల బంగారం, 15 తులాల వెండి పట్టగొలుసులు, రూ.8వేల నగదు ఎత్తుకెళ్లినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.