
ఐసీడీఎస్‌లో ఆగని అక్రమాలు
మెట్‌పల్లి: మెట్‌పల్లి ఐసీడీఎస్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు చెందిన కొందరు నిర్వాహకులు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కడుపు కొడుతున్నారు. కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని వారికి అందించకుండా బయట అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. సీడీపీఓ, సూపర్‌వైజర్ల పర్యవేక్షణ కొరవడడంతో చాలా కాలంగా పెద్ద ఎత్తున సరుకులు పక్కదారి పడుతున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న నిర్వాహకులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. దీంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఐదు మండలాలు..312 కేంద్రాలు
● మెట్‌పల్లి ఐసీడీఎస్ పరిధిలో కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్ మండలాలు ఉన్నాయి.
● ఈ మండలాల్లో 312 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటికి ప్రతినెలా ప్రభుత్వం పోషకాహార వస్తువులను సరఫరా చేస్తుంది.
● వీటిని కేంద్రాల నిర్వాహకులు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సి ఉంటుంది.
ప్రధానంగా పాలు, బాలమృతం ప్యాకెట్లు
● మొత్తం సరఫరా చేస్తున్న వస్తువుల్లో ప్రధానంగా పాలు, బాలమృతం ప్యాకెట్లను నిర్వాహకులు అమ్ముకుంటున్నారు.
● అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రతినెలా 2.50కిలోల బాలమృతాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది.
● చిన్నారులు బలంగా ఎదగడానికి ఇది దోహాదం చేస్తుంది. అయితే కొందరు ఈ ప్యాకెట్లను డెయిరీ నిర్వాహకులకు అమ్ముకుంటున్నారు. వారు వీటిని గేదెలకు దాణాగా వినియోగిస్తున్నారు.
● పట్టణంలో ఉన్న పలువురు గేదెలపెంపకందారులు వీటిని బహిరంగంగానే వినియోగిస్తున్నారు.
● అలాగే గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేకంగా అందించే హోమోజినైజ్డ్ టోన్డ్ పాలను పూజ స్టోర్‌లకు అమ్ముతున్నారు.
తనిఖీలు.. చర్యలు శూన్యం
● కేంద్రాలను తరచూ సీడీపీఓ, సూపర్‌వైజర్లు తనిఖీలు చేసి పోషకాహారం సక్రమంగా పంపిణీ జరుగుతోందా..? లేదా..? అని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి.
● మొక్కుబడిగా తనిఖీలు చేస్తూ.. చేతులు దులుపుకుంటున్నారు.
● ఈ కారణంగానే మెట్‌పల్లి ఐసీడీఎస్ పరిధిలో చాలాకాలంగా పెద్ద ఎత్తున సరుకులు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
● పాలు, బాలామృతం ప్యాకెట్లను కొందరు అమ్ముకుంటున్న వైనంపై గతంలోనూ పలు కథనాలు వచ్చాయి.
● అయినా అధికారులు వీటికి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
● దీనివల్ల కొందరు నిర్వాహకులు ఇంకా సరుకులు పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటూనే ఉన్నారు.
● ఉన్నతాధికారులు స్పందించి మెట్‌పల్లి ఐసీడీఎస్ పరిధిలో జరుగుతున్న అక్రమాలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మణెమ్మను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.
పాలు, బాలామృతం పక్కదారి
ఏళ్ల తరబడిగా సాగుతున్న అక్రమాలు
చిన్నారులకు అందని పౌష్టికాహారం
పట్టణ శివారులోని ఓ డెయిరీ ఫాం వద్ద ఇలా కనిపిస్తున్నవి బాలామృతం ప్యాకెట్లు. ఇక్కడ కూడా ఈ పోషకాహారాన్ని గేడెలకు ఆహారంగా వినియోగిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి చాలా రోజులుగా ఇక్కడకు పెద్ద సంఖ్యలో ప్యాకెట్లను తరలిస్తున్నట్లు తెలిసింది.
‘ఈ చిత్రంలో కనిపిస్తున్నది
బాలామృతం ప్యాకెట్. మెట్‌పల్లిలోని ఓ డెయిరీ ఫాంలో ఇలా ఉంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించాల్సిన ఈ ప్యాకెట్లను డెయిరీ ఫాంలోని గేదెలకు దాణాగా వాడుతున్నారు. కొందరు టీచర్లు తమ స్వలాభం కోసం ప్యాకెట్లను ఇలా విక్రయిస్తున్నారు.

ఐసీడీఎస్‌లో ఆగని అక్రమాలు