
కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయండి
మల్యాల: కొండగట్టు ఆలయ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం 300 ఎకరాలు సేకరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని ముందుకెళ్లాలని ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కొండగట్టు అంజన్నను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్లు తుల ఉమ, దావ వసంత, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి సోమవారం స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముత్యంపేట శివారు వరదకాలువ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిందన్నారు. కేటాయించిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం కుదించిందని, తక్షణమే ఆ నిధులు కేటాయించేలా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవ చూపాలన్నారు. తాను కొండగట్టు అభివృద్ధి అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని, ప్రస్తుత ఎంపీ నిధులు తీసుకురావాలని సూచించారు. రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధి చేపట్టిన కేసీఆర్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దారని తెలిపారు. అంజన్న సన్నిధిలో కొత్త కోనేరు నిర్మించి, వసతులు కల్పించామన్నారు. మాజీ జెడ్పీటీసీలు కొండపల్కల రాంమోహన్‌రావు, ప్రశాంతి కృష్ణారావు, మాజీ ఎంపీపీ ఎడిపెల్లి అశోక్, పాక్స్ చైర్మన్ బోయినపల్లి మధుసూదన్‌రావు, అయిల్నేని సాగర్ రావు పాల్గొన్నారు.
ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలి
ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్