
జీవన విధానంలో మార్పు అవసరం
జగిత్యాల: సరైన ఆహార నియమాలు పాటిస్తూ.. జీవనశైలిలో మార్పు వస్తేనే రక్తపోటు అదుపులో ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం రక్తపోటు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో ఐఎంఏ ఉచిత వైద్య పరీక్షలు చేపట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తం ప్రతి అవయవ పనితీరుకు కీలకభూమిక పోషిస్తుందని, రక్తపోటు నియంత్రణతోనే అవయవాల పనితీరు మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ నిత్యం వాకింగ్, ఎక్సర్‌సైజ్‌లు చేపట్టాలని పేర్కొన్నారు. రక్తపోటు ఉన్నవారిలో చూపు మందగిస్తుందన్నారు. ఒక్కోసారి గుండెపోటుకు దారితీస్తుందన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ మాట్లాడుతూ.. రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలన్నారు. అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి అర్చన మాట్లాడుతూ.. మందులను నిర్దేశించిన సమయాల్లో ప్రతిరోజు వాడటం చాలా ముఖ్యమన్నారు. అనంతరం పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్, ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి సుదీర్‌కుమార్ పాల్గొన్నారు.