
కొలువుల వేట
చదువుల మూట..
సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రస్తుత కాలంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. నేటికాలంలో ప్రభుత్వ ఉద్యోగాల మాట దేవుడెరుగు. ప్రైవేటు రంగంలోకి వెళ్తామన్నా పోటీ నెలకొందని పలువురు అంటున్నారు. చదువుకు తగిన ఉద్యోగం, ఉద్యోగానికి తగిన వేతనం దొరక్క నానా తంటాలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల జిల్లాల్లోని ఉపాధి కల్పన కార్యాలయాలు ప్రైవేటు కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నా.. వేలల్లో నిరుద్యోగులు ప్రయివేటు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఆందోళన కలిగిస్తోన్న నిరుద్యోగ రేటు
ఉమ్మడి జిల్లాలో ఏటా వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారి కన్నా.. నిరుద్యోగులుగా నమోదవుతున్న వారే అధికంగా ఉంటున్నారు. జాతీయ కార్మిక బలగం వార్షిక (2023–24)నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 16.06శాతం ఉన్నట్లు చెబుతోంది. డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు చదివినా జీవనోపాధి లభించకపోవడం నిరుద్యోగానికి ప్రధాన కారణమని తెలిపింది.
డిమాండ్ ఉన్న కోర్సులు
ప్రస్తుతకాలంలో చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు, స్నేహితులు చెప్పిన విధంగా కోర్సులు ఎన్నుకుంటున్నారు. వారికి నచ్చిన నచ్చకపోయినా కోర్సులు పూర్తి చేస్తున్నారు. ఆ కోర్సులకు మార్కెట్లో డిమాండ్ ఉందా? లేదా అనే అంశాన్ని మర్చిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో వైద్యసేవలందించే సంస్థలు పెరిగిపోతుండటంతో నర్సింగ్, ఫార్మసీ కోర్సులు పూర్తిచేసినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండనున్నాయని, ఐటీఐ, ట్రేడ్‌ల్లో కోర్సులు అభ్యసించినవారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
సుమారు 5వేల మంది నమోదు
ఉమ్మడి జిల్లాలోని ఉపాధి కల్పన కార్యాలయాల్లో ఏడాదికి సుమారు 5వేల మంది యువత నిరుద్యోగులుగా నమోదు చేసుకుంటున్నారని అధికారులు చెబతున్నారు. ప్రతీనెలా సుమారుగా రెండు ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. హాజరైన వారిలో 50శాతం మంది ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారని అధికారులు చెబుతున్నారు. చాలామందిలో సరైన ఉద్యోగ సామర్థ్యాలు లేక నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నదని నిపుణులు చెబుతున్నారు. చాలామంది కోర్సు పూర్తిచేస్తున్నారే తప్పా... ఉపాధి మార్గాల వైపు దృష్టి సారించలేకపోతున్నారని వివరిస్తున్నారు. వేతనం తక్కువగా ఉందనుకోవటం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం, ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడకపోవటం ప్రధాన కారణాలు అంటున్నారు.
ఎంపికవుతున్నా..
నిరుద్యోగ యువతకు ఉపాధి కార్యాలయాల్లో జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నా సరిగా సద్విని యోగం చేసుకోవడం లేదు. కొందరు ఎంపికై నా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పని చేసేందుకు విముఖత చూపుతున్నారు. నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సెలింగ్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, పోటీపరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాం.
– టి.తిరుపతిరావు, ఉపాధి కల్పనాధికారి,
కరీంనగర్
హైదరాబాద్‌లో ఉద్యోగం
మాది కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామం. నేను బీఎస్సీ నర్సింగ్ చేశాను. ఏప్రిల్‌లో ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించిన జాబ్‌మేళాలో పాల్గొన్న. హైదరాబాద్‌లోని ఓ ట్రస్ట్‌లో ఉద్యోగం వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. నిరుద్యోగులుగా ఖాళీగా ఉండే బదులు ఏదైన ఒక కంపెనీ వెతుక్కుని ప్రతీ ఒక్కరు ఉపాధి పొందాలి.
– ఎం మానస, శ్రీరాములపల్లి

కొలువుల వేట

కొలువుల వేట

కొలువుల వేట