
అతివేగం.. అజాగ్రత్త.. రెండు ప్రాణాలు
● పాదచారిని ఢీకొట్టిన ద్విచక్రవాహదారుడు
● ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరి మృతి
● చికిత్స పొందుతున్న మరొకరు
గంగాధర: కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారిపై గంగాధర మండలం ఇస్లాంపూర్ బస్టాండు సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం.. అజాగ్రత్త ఇద్దరి ప్రాణం బలిగొంది. నడుచుకుంటూ వెళ్తున్న హనుమాన్ దీక్షాపరున్ని ద్విచక్రవాహనదారుడు వెనకనుంచి వేగంగా ఢీకొట్టాడు. పాదచారితో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. బైక్ వెనక కూర్చున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్రైనీ ఎస్సై స్వాతి వివరాల ప్రకారం.. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన కొండి శ్రీనివాస్(33) హనుమాన్ దీక్ష స్వీకరించాడు. మాల విరమణ కోసం గురువారం రాత్రి కాలి నడకన కొండగట్టుకు తోటిస్వాములతో కలిసి బయల్దేరారు. గంగాధర మండలం ఇస్లాంపూర్ బస్టాండు సమీపంలో సుమారు 11 గంటలకు కొడిమ్యాల మండలం గౌరాపూర్ గ్రామానికి చెందిన కాసాని గణేశ్(30), కాసాని రాజు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ శ్రీనివాస్‌ను ఢీకొట్టారు. శ్రీనివాస్‌తో పాటు, గణేశ్ తీవ్ర గాయాల పాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కాసాని రాజు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
అల్పచేసి అనంతలోకాలకు
గర్శకుర్తి గ్రామానికి చెందిన కొండి శ్రీనివాస్ అల్ప చేసిన ఐదు నిమిషాల్లోనే రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు చేరిన ఘటన గ్రామంలో విషాదం నింపింది. కొండి శ్రీనివాస్ జీవనోపాధి కోసం సింగపూర్ వెళ్లాడు. రెండేళ్లక్రితం తిరిగివచ్చి వివాహం చేసుకున్నాడు. ఏడాదిలోపు వయసున్న కూతురు ఉంది. స్వగ్రామంలో వెల్డింగ్‌షాపు నిర్వహిస్తున్నాడు. గ్రామంలోని మిత్రులతో కలిసి హనుమాన్ దీక్ష తీసుకున్నాడు. గ్రామానికి చెందిన దాదాపు 12మందితో కలిసి గురువారం ఏడుగంటల ప్రాంతంలో పాదయాత్రగా కొండగట్టుకు బయల్దేరారు. ఇస్లాంపూర్ సమీపంలో ఆగి అల్పాహారం తీసుకున్నారు. అరగంటసేపు విశ్రాంతి తీసుకుని పాదయాత్రగా బయల్దేరగా ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందాడు.

అతివేగం.. అజాగ్రత్త.. రెండు ప్రాణాలు