
నిర్వహణపై నిర్లక్ష్యం
● జిల్లాలో నిరుపయోగంగా మారిన క్రీడా ప్రాంగణాలు
● అందుబాటులో లేని ఆట వస్తువులు
● కొరవడిన వసతులు
మెట్‌పల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు క్రీడలపై ఆసక్తి పెంచాలనే లక్ష్యంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. వాటిల్లో పూర్తిస్థాయి ఆట వస్తువులు అందుబాటులో ఉంచకపోవడం, సరైన వసతులు కల్పించక పోవడంతో జిల్లాలో అలంకార ప్రాయంగా మారాయి. వీటి నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో నిరుపయోగంగా మారి ప్రజాధనం వృథా అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
26వార్డుల్లో రూ.30లక్షలు కేటాయింపు
● మెట్‌పల్లి మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. వీటిలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం రూ.30 లక్షలు మంజూరయ్యాయి.
● 20 వార్డుల్లో స్థలాలను ఎంపిక చేసి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయగా.. మిగతా ఆరు వార్డుల్లో స్థలాల సమస్యతో ఏర్పాటు చేయలేదు.
● ఒక్కో క్రీడా ప్రాంగణంలో వాలీబాల్, ఖోఖో కోట్‌లు, రెండు ఎక్సర్‌సైజ్ బార్‌లు, లాంగ్ జంప్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. కానీ చాలా చోట్ల్ల కేవలం రెండు ఎక్సర్‌సైజ్ బార్‌లతోనే సరిపెట్టారు.
జిల్లాలో అంతటా ఇదే పరిస్థితి
● ఒక్క మెట్‌పల్లిలోనే కాకుండా దాదాపుగా జిల్లా అంతటా క్రీడా ప్రాంగణాల పరిస్థితి ఇలాగే ఉంది.
● ఎక్కడా కూడా వాలీబాల్, లాంగ్ జంప్, ఖోఖో కోట్‌లను ఏర్పాటు చేయకపోవడమే కాకుండా వాటికి సంబంధించిన సామగ్రిని అందుబాటులో ఉంచలేదు.
● మరోవైపు పంచాయతీలు, మున్సిపాలిటీలు వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
● వాటిల్లో లైట్లు, నీటి వసతి వంటి కనీస వసతులు కల్పించలేదు.
● పరిశుభ్రత చర్యలను చేపట్టడం లేదు. అంతేగాకుండా కొన్ని చోట్ల గ్రామాలకు, కాలనీలకు దూరంగా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు.
● ఈ కారణాలతో అవి నిరుపయోగంగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
● వీటి ఏర్పాటుకు జిల్లా మొత్తం మీద రూ.కోట్లు వెచ్చించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడం గమనార్హం.
తగిన చర్యలు తీసుకుంటాం
చాలా చోట్ల క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. కాలనీలకు దూరంగా ఉన్న వాటిని మరో చోటుకు తరలిస్తాం. ప్రతీ ప్రాంగణంలో తగిన వసతులు ఏర్పాటు చేస్తాం. క్రీడాకారులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటాం.
– మోహన్, మున్సిపల్ కమిషనర్, మెట్‌పల్లి
ఇది మెట్‌పల్లి పట్టణ శివారులో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం. జనం వెళ్లని ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో ప్రాంగణమంతా పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో అధ్వానంగా తయారైంది. ఇందులో రెండు ఎక్సర్‌సైజ్ బార్‌లు తప్ప మిగతా క్రీడా పరికరాలు ఏమీ లేవు. క్రీడాకారులెవరూ అటు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇలా ఒక్క చోటనే కాదు జిల్లాలో చాలా చోట్ల క్రీడా ప్రాంగణాల పరిస్థితి ఇలాగే ఉంది.

నిర్వహణపై నిర్లక్ష్యం