
కార్మికుల వేతనాలు పెంచాలి
● డ్రైవర్ల ఆందోళన.. ఎమ్మెల్యేకు వినతి ● జీవో ప్రకారం చెల్లింపు అంటున్న మున్సిపల్ అధికారులు
జగిత్యాల: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అన్న చందంగా మారింది జగిత్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి. 72 మంది డ్రైవర్లు పనిచేస్తుండగా 52 మందికి రూ.20 వేల వరకు వేతనం వస్తుండేది. మిగతా వారు జీతాల్లో వ్యత్యాసం ఉందని, మాకు సైతం పెంచాలని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం జీవోలో మంజూరు ఉన్న 34 మందికి డైరెక్టర్ ఆఫ్ కంట్రిప్లానింగ్ వారు జారీ చేసిన దానిలో డ్రైవర్లుగా సాంక్షన్ ఉంది. ప్రస్తుతం 34 మందికే రూ.20 వేల జీతం చెల్లిస్తున్నారు. మొన్నటి వరకు 57 మందికి చెల్లించారు.. స్పెషల్ ఆఫీసర్ అనుమతితో చెల్లించాల్సి ఉన్నా వారికి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి రాలేదని బల్దియా అధికారులు పేర్కొంటున్నారు. కానీ కార్మికులు మాకు మొన్నటి వరకు జీతాలు చెల్లించి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.
ఎమ్మెల్యేకు వినతి
గతంలో రూ.20 వేల జీతం చెల్లించగా ప్రస్తుతం తగ్గించి రూ.16 వేలు చెల్లించారని మున్సిపల్ కార్మికులు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వద్దకు వెళ్లి వినతిపత్రం అందజేశారు. గతంలో మాకు జీతాలు రూ.20 వేల వరకు చెల్లించారని, తగ్గించడంతో మా కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి రూ.20 వేల జీతం చెల్లించాలని వారు కోరుతున్నారు.
కార్మికులకు అండగా ఉంటా: సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే
కార్మికులకు అండగా ఉంటానని, అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్తా.
జీవో ప్రకారం ఇచ్చాం : స్పందన, మున్సిపల్ కమిషనర్
34 మందికే ప్రభుత్వం గత ఫిబ్రవరిలో డ్రైవర్లుగా మంజూరు ఇచ్చింది. డ్రైవర్లతో సమావేశం నిర్వహించాకే నిర్ణయం తీసుకున్నాం. గతంలో సుమారు 57 మందికి కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.