
పల్లె దవాఖానాతో మెరుగైన వైద్యం
రాయికల్: పల్లె దవాఖానతో నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని అయోద్య, అల్లీపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించారు. అయోధ్యలో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన రూ.10 లక్షలతో సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు. నియోజకవర్గానికి 14 పల్లె దవాఖానాలు మంజూరయ్యాయని గుర్తుచేశారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ఎంపీడీవో చిరంజీవి, ఎంపీవో సుష్మ, సింగిల్ విండో చైర్మన్లు దీటి రాజిరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, రాజలింగం పాల్గొన్నారు.
బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ నిర్వహించారు. 13 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
‘పాలిసెట్’కు ఏర్పాట్లు పూర్తి
జగిత్యాల: జిల్లాలో మంగళవారం జరిగే పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్, కో–ఆర్డినేటర్ అశోక్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3,520 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, జిల్లాకేంద్రంలో ఆరు, కోరుట్లలో ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి లేదని వివరించారు.
ఘనంగా నర్సుల దినోత్సవం
జగిత్యాల: నర్సులు సేవలకు ఆదర్శమని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో అంతర్జాతీయ నర్సుల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సింగ్ సిబ్బంది వేతనాలు కొత్త పీఆర్సీలో 50 శాతం ఫిట్‌మెంట్‌తో స్థిరీకరణ చేయాలని, వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. సామాజిక సేవకుడు రాజగోపాలాచారి, విశ్వనాథం, ఆస్పత్రి సూపరింటెండెంట్ సుమన్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ కళాశతి, విజయమ్మ, అనిత, సుభాషిణి పాల్గొన్నారు.
మావోయిస్టులతో చర్చలు జరపాలి
జగిత్యాలటౌన్: కేంద్రప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి అన్నారు. ఈనెల 14న కరీంనగర్‌లోని ఫిల్మ్ భవన్‌లో నిర్వహించనున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐదో మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం చౌరస్తాలో పోస్టర్ ఆవిష్కరించారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని లేఖల ద్వారా పేర్కొంటున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు పుల్ల సుచరిత, నార వినోద్ పాల్గొన్నారు.
బకాయిలు విడుదల చేయాలి
జగిత్యాల: విద్యార్థుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ లతకు వినతిపత్రం అందించా రు. బకాయిలు విడుదల చేయక శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభు త్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. మాజీ జెడ్పీటీసీ మహేశ్, గంగాధర్, మల్లేశం, శ్రీధర్, చింత గంగాధర్ పాల్గొన్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం రానీయొద్ద
జగిత్యాల: గాంధీనగర్ వద్ద మంచినీళ్ల బావి వద్ద రూ.18 కోట్లతో బ్లాక్‌స్పాట్ రోడ్డు మంజూరైంద ని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. పాత వంతెన తొలగించి డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. అడువాల లక్ష్మణ్, కౌన్సిలర్లు బాలె శంకర్, రాము, ఎన్‌హెచ్ ఈఈ మల్లారెడ్డి, డీఈ గులాబ్‌సింగ్ పాల్గొన్నారు.

పల్లె దవాఖానాతో మెరుగైన వైద్యం

పల్లె దవాఖానాతో మెరుగైన వైద్యం