
ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ
● ఇంటి నంబర్ ఇస్తలేరు
గ్రామంలో మా తండ్రి తోట తిరుపతి పేరున ఉన్న ఇంటిని కూల్చివేసి గ్రామపంచాయతీ నుంచి ఆస్తి మార్పిడి, ఇంటి నిర్మాణ అనుమతులు పొంది ఇల్లు నిర్మించుకున్నాను. ఆ ఇంటికి ఆన్‌లైన్‌లో అనుమతి ఇచ్చినా ఇంటి నంబర్ కేటాయించడం లేదు. పంచాయతీ కార్యదర్శిని సంప్రదిస్తే మీకు అనుమతి ఇచ్చిన పాత కార్యదర్శిని అడగండంటూ తప్పించుకుంటున్నాడు. గతంలో ఇచ్చిన ఆన్‌లైన్ అనుమతుల మేరకు మా కొత్త ఇంటికి నంబర్ ఇప్పించండి.
– తోట శ్రీరాములు, ఇబ్రహీంనగర్,
గొల్లపల్లి మండలం
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి కలెక్టర్ బి.సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై 30ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అనంతరం సత్వరమే పరిష్కరించాలని అదికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, ఆర్డీవోలు పులి మధుసూదన్‌గౌడ్, జివాకర్, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
రశీదుల కోసం తిప్పలు
ప్రజావాణిలో అర్జీ సమర్పిస్తే వెంటనే రశీదు ఇవ్వడం లేదు. తనకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని ఓ వికలాంగుడు దరఖాస్తు చేసుకుని రశీదు ఇచ్చే కౌంటర్ వద్దకు వెళ్లాడు. సాయంత్రం వచ్చి తీసుకోవాలని సంబంధిత అధికారి చెప్పడంతో కంగుతిన్నాడు. వికలాంగుడినైన తాను ఆటో కిరాయికి మాట్లాడుకుని వచ్చానని, మరోసారి రావాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినా అధికారులు ఆయన మాట వినిపించుకోలేదు.

ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ