
ఆర్థిక సాధికారత దిశగా అడుగులు
● మహిళా సంఘాలకు లబ్ధి చేకూరేలా కార్యక్రమాలు ● ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌తో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ ● ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల విక్రయం
మల్యాల: జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. పంటలు ఉత్పత్తి చేసే రైతులతోపాటు మహిళా సంఘాలకు లబ్ధి చేకూరేలా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో) ఏర్పాటు చేసుకుని ముందుకు కదులుతున్నారు. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి.. వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను వినియోగం చేసుకుంటూ రికవరీలోనూ ముందుంటున్నారు. మహిళా సంఘాల్లోని సభ్యులతో ఎఫ్‌పీవో గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎరువులు, విత్తనాల విక్రయాలు కూడా చేపడుతున్నారు. ఇప్పటివరకు 92 గ్రూపులు ఏర్పాటు చేశారు. మొక్కజొన్న, నువ్వులు, మామిడి, పప్పుల దినుసుల కొనుగోలు చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా రూ.1.10 కోట్ల మార్కెటింగ్
జిల్లాలో 2018 నుంచి ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో రైతులకు మద్దతు ధర అందించడంతోపాటు, ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు విక్రయించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద మెట్‌పల్లి, మల్యాలలో ఇన్‌పుట్ దుకాణాలు ఏర్పాటు చేశారు. మామిడి, మొక్కజొన్న, బాస్మతి ధాన్యం, స్వీట్‌లెమన్ మార్కెటింగ్ ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.1.10కోట్ల విలువైన మార్కెటింగ్ చేశారు. చిన్న, సన్నకారు రైతులకు లాభాపేక్ష లేకుండా తక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నారు.