
ప్రతి తరగతికి ఉపాధ్యాయుడిని నియమించాలి
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలని టీపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. వయస్సును బట్టి తరగతి కాకుండా సామర్థ్యాన్ని బట్టి ఏ తరగతిలో చేర్చాలన్న నిర్ణయాధికారం ప్రధానోపాధ్యాయునికి ఉండేలా అవకాశం కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహణ బాధ్యతలను ప్రధానోపాధ్యాయుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు పర్చేలా చూడాలన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అయిల్నేని నరేందర్‌రావు మాట్లాడుతూ, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక లావాదేవీలను వెంటనే విడుదల చేయాలని, డీఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒడ్నాల రాజశేఖర్, మహిపాల్‌రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.