
ఐదు కేజీబీవీల్లో కొత్త కోర్సులు
● అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ● ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు
కథలాపూర్: జిల్లాలోని ఐదు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు కొన్ని విద్యాలయాల్లో ఇంటర్, మరికొన్నిటిలో పదోతరగతి వరకు మాత్రమే నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న భవనాలు, వసతులను బట్టి ఐదు విద్యాలయాలను అప్‌గ్రేడ్ చేసి ఇంటర్ కోర్సులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జిల్లాలో ఏడు కేజీబీవీల్లో ఇంటర్ కోర్సులు నిర్వహిస్తున్నారు. తాజాగా మరో ఐదింటికి అనుమతి రావడంతో 12 కేజీబీవీల్లో ఇంటర్ విద్య అందనుంది. కథలాపూర్, ధర్మపురి, మల్యాల, మేడిపల్లి, మల్లాపూర్‌లోని కేజీబీవీల్లో ఇంటర్ కోర్సులకు అనుమతి వచ్చింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ కోర్సు నిర్వహించనున్నారు. ఒక్కో కేజీబీవీలో 40 సీట్లకు మాత్రమే అనుమతి వచ్చినట్లు జీసీడీవో అనుపమ వివరించారు.