
ఏఈవోలకు వివరాలు ఇవ్వండి
జగిత్యాలరూరల్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా రైతులకు విశిష్ఠ గుర్తింపు సంఖ్య నమోదును జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించామని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. భూమి ఉన్న ప్రతి రైతు వ్యవసాయ విస్తీర్ణాధికారులకు తమ పట్టాదారు పాస్‌బుక్కులు, ఆధార్‌కార్డు, సెల్‌నంబర్ ఇవ్వాలని, ఆ మొబైల్ నంబర్‌కు మూడు ఓటీపీలు వస్తాయని, ఆ వివరాలను వ్యవసాయ విస్తీర్ణాధికారికి అందిస్తే విశిష్ఠ సంఖ్య తెలుస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన పథకాల్లో అమలులో పారదర్శకత ఉండేందుకు ఈ విశిష్ఠ సంఖ్య ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పీఎం కిసాన్, సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన వంటి పథకాల్లో ఈ సంఖ్య తప్పనిసరి అని, 20వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు రావాలన్నా.. ఈ సంఖ్య ప్రమాణికం అని వివరించారు.
గాలివానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
జగిత్యాలటౌన్: రెండురోజులుగా ఈదురుగాలులు, వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భారత్ సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీఎస్.రాజు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందించారు. మల్లాపూర్, రాయికల్, బీర్‌పూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో మామిడి, 250 ఎకరాల్లో వరి, కొనుగోలు కేంద్రాలతోపాటు కల్లాల్లోని ధాన్యం తడిచిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట నాయకులు చిట్ల గంగాధర్, అక్కినపెల్లి కాశీనాథం, నరేందుల శ్రీనివాస్, ఎడమల వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
బాధిత మహిళల రక్షణకు ‘భరోసా’
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని సీసీఎస్ సీఐ శ్రీనివాస్ అన్నారు. భరోసా కేంద్రం ప్రథమ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆపదలో ఉన్న వారికి చేయూత అందిస్తున్నామన్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలు, బాలికలకు అండగా ఉంటున్నామని, వారి మానసిక పరిస్థితిని తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్నామని వివరించారు. అనంతరం సిబ్బందిని అభినందించారు. ఎస్సై గీత, భరోసా సెంటర్ కో–ఆర్డినేటర్ మనీష, అధికారులు సుజాత, ప్రతిభ పాల్గొన్నారు.
భూదేవికి బూరెలు సమర్పణ
రాయికల్: భూమికి కోపం వచ్చి భూకంపం వచ్చిందంటూ బుధవారం మండలంలోని మూటపల్లికి చెందిన మహిళలు బూరెలు చేసి భూదేవికి సమర్పించారు. బూరెలు సమర్పిస్తే భూమాత శాంతిస్తుందని మహిళలు పేర్కొన్నారు.
శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాస్
జగిత్యాల: జగిత్యాల శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆర్మూర్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ బదిలీపై ఇక్కడకు వచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీలో ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కావాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కరు మాత్రమే ఉన్నారు. శ్రీనివాస్ రావడంతో ఇద్దరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.

ఏఈవోలకు వివరాలు ఇవ్వండి

ఏఈవోలకు వివరాలు ఇవ్వండి