
కోర్టు భవనాలకు ముహూర్తం
● సిరిసిల్ల, పెద్దపల్లి సహా 12 జిల్లాలకు కొత్త కాంప్లెక్స్‌లు ● పోక్సో, ఫ్యామిలీ కోర్టుల కోసం బిల్డింగులు ● ‘న్యాయ నిర్మాణ్’ ప్రణాళిక కింద నిర్మాణాలు ● రూ.691 కోట్లతో టెండర్లు పిలిచిన ఆర్‌అండ్‌బీ ● ఉమ్మడి జిల్లాకు రూ.118 కోట్లు ● నాలుగంతస్తులు.. 2.18 లక్షల చదరపు అడుగుల స్పేస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో కొత్తగా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి ముహూర్తం సిద్ధమైంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత పలు కొత్త జిల్లాల్లో కోర్టు భవనాల కొరత ఉన్న విషయం తె లిసిందే. ఈ నేపథ్యంలో న్యాయనిర్మాణ ప్రణాళిక కింద మంచిర్యాల, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి , యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, వికారాబాద్ మొత్తం 12 జిల్లాలో ఫ్యామిలీ, పోక్సో కోర్టుల భవన సముదాయాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ భవనాల నిర్మాణాన్ని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, యాదాద్రి సర్కిల్ వారు పర్యవేక్షించనున్నారు. గత వారంలో టెండర్లు పిలవగా.. టె ండర్లకు మంచి ఆదరణ ఉందని సమాచారం. పలు పేరు మోసిన సివిల్ కాంట్రాక్ట్ కంపెనీలు భవన ని ర్మాణానికి ముందుకు వచ్చినట్లు తెల్సింది. ఈనెల రెండో వారంలో రూ.691.18 కోట్లతో టెండర్లు ఖ రారు కానున్నాయి, ఇందులో పెద్దపల్లి, సిరిసిల్ల కో సం దాదాపు రూ.118 కోట్లు కేటాయించనున్నారు.
24 నెలల్లో పూర్తి..
ఈ భవనాలు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఉండనున్నాయి. ప్రతీ భవనంలో ఒక బేస్‌మెంట్ (88 కార్లు, 62 బైకులు పార్కింగ్ చేసుకునేలా పార్కింగ్ లాట్), గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఈ భవన సముదాయాలను నిర్మించనున్నారు. అనంతరం ఈ భవన సముదాయాల్లో పోక్సో, ఫ్యామిలీ కోర్టులు నడవనున్నాయి. ప్రతీ ఫ్లోర్‌లో 43వేల చదరపు అడుగుల నుంచి 44వేల చదరపు అడుగుల చొప్పున మొత్తం 2,18, 743.58 చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం మరో రెండు అంతస్తులు నిర్మించుకునేలా భవనాలు సిద్ధం చేస్తారు. మే రెండో వారంలో టెండర్లు ఖరారు కాగానే నిర్మాణాలు మొదలవుతాయి. నిర్మాణాలుమొదలైన 24 నెలల్లో అంటే 2027 నాటికి ఈ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రూ.691.18 కోట్లతో..
మొత్తం రూ.691.18 కోట్ల బడ్జెట్‌తో ఈ భవనాలు నిర్మించనున్నారు. ప్రతీ భవనం తూర్పు అభిముఖ ంగా విశాలంగా, విరివిగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇందుకోసం రాజ సం ఉట్టిపడేలా భవనం మధ్యలో భారీ ఎలివేషన్‌తో ముఖద్వారం, దానికి ఇరువైపులా రెండు విశాలమైన భుజాలతో ఆర్ట్స్ కాలేజీ తరహాలో భవనం స్కెచ్ కూడా ఖరారైంది. ప్రతీ భవనం సివిల్, ఎలక్ట్రిక్, సానిటరీ– వాటర్ వర్క్స్ కోసం దాదాపు రూ. 53 కోట్ల నుంచి రూ.59 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందులో సిరిసిల్ల కోర్టు కాంప్లెక్స్‌కు రూ. 59.92కోట్లు, పెద్దపల్లి కోర్టు భవన సముదాయాల కు రూ.58.58 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిలో జీఎస్టీ కలపలేదు. మొత్తం రూ.691 కోట్లలో రూ. 563 కోట్లు సివిల్ పనులకు, రూ.563.70 కోట్లు శానిటరీ, వాటర్ వర్క్స్ కోసం రూ.7.01 కోట్లు, ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం రూ.120.46కోట్లుగా పేర్కొన్నారు.