
రచ్చకెక్కిన కాంగ్రెస్ వర్గపోరు
● కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం రసాభాస ● జువ్వాడి నర్సింగరావు, సుజిత్‌రావు వర్గాల మధ్య తోపులాట ● సముదాయించిన జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం రసాభాసగా మారింది. పార్టీ జిల్లా పరిశీలకులు కత్తి వెంకటస్వామి సమక్షంలోనే ఇరువర్గాలు పరస్పర దూషణలు, తోపులాటకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలో ఏబీ కన్వెన్షన్‌లో బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అయితే మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్దన్ స్టేజీపై కూర్చోవడంతో కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు వర్గం ఒక్కసారిగా లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా కల్వకుంట్ల సుజిత్‌రావు వర్గీయులు లేచి వారితో వాగ్వివాదానికి దిగారు. దీంతో కాసేపు తోపులాట చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారని, పార్టీని నమ్ముకుని ఉన్న తమకు అన్యాయం చేశారని వేదిక వద్ద ఉన్న నాయకులను నిలదీశారు. నాయకులు ఎంత సర్దిచెప్పినా వినని నాయకులు జువ్వాడికి అనుకూలంగా నినాదాలు చేశారు. గోబ్యాక్ బీఆర్‌ఎస్ కోవర్ట్ అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సుజిత్‌రావు వర్గీయులు కూడా ఎదురుదాడికి దిగడంతో గొడవ మరింత ముదిరింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జోక్యం చేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. అనంతరం సుజిత్‌రావు వర్గీయులైన గోవర్దన్ తదితరులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతకు మారుపేరని, పదేళ్ల బీఆర్‌ఎస్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా ప్రభు త్వ పాలన సాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రచ్చకెక్కిన కాంగ్రెస్ వర్గపోరు