జగిత్యాలజోన్: జగిత్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 31న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి టి.గంగాధరాప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, గ్రంథాలయ కార్యదర్శి, కోశాధికారి, మహిళా ప్రతినిధి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి, 10 మంది కార్యవర్గ సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 23, 24వ తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 25న నామినేషన్లు పరిశీలిస్తామని, 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, 31న పోలింగ్ నిర్వహించి, అదేరోజు ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వివరించారు.