గాలి ద్వారా గర్భం.. గంటలోనే ప్రసవం!

Viral: Indonesian Woman Says Gust of Wind Made Her Pregnant - Sakshi

జకార్త : నవమాసాలు మోసిన తర్వాతే ఏ మహిళైనా బిడ్డకు జన్మనిస్తుంది. గాలి దేవుడిని ప్రార్థించి కుంతీదేవి భీమసేనుడిని కన్నదని కేవలం పురాణాల్లో మాత్రమే చదువుకున్నాం. వందల శతాబ్ధాల తరువాత మరోసారి అలాంటి వార్తనే వింటున్నాం. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ తన గర్భం వెనుకున్న రహస్యం గురించి చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ జావాలోని సియాంజూర్‌ పట్టణానికి చెందిన జైనా అనే 25 ఏళ్ల మహిళా ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాను పురుషుడితో కలయిక ద్వారా కాకుండా గాలి ద్వారా గర్భం దాల్చినట్లు పేర్కొంది.

అంతేగాక తను గర్భవతి అవ్వడం, ప్రసవించడం అంతా కేవలం గంట సమయంలోనూ జరిగిపోయిందని వింత వాదన చేస్తోంది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘మధ్యాహ్నం ప్రార్థన చేసుకున్న తరువాత, నా యోని ద్వారా గాలి నా శరీరంలోకి అకస్మాత్తుగా ప్రవేశించింది. ఆ సమయంలో నేను మీద నేల పడుకున్నాను. గదిలో గాలి వీచిన 15 నిమిషాలకు కడుపులో నొప్పిగా అనిపించింది. కొద్దిసేపటి తరువాత పొత్తికడుపు ఆకస్మాత్తుగా పెద్దదిగా అయ్యింది’ అని పేర్కొంది.

అయితే బాధితురాలు నిజంగానే గర్భందాల్చడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి కమ్యూనిటీ క్లినిక్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చిందని, శిశువు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే, గాలి వల్ల గర్భం దాల్చానని చెబుతున్న ఆమె మాటలు ఏ విధంగా నమ్మశక్యంగా లేవని వైద్యులు చెబుతున్నారు. ప్రసవించే వరకు మహిళకు తను గర్భవతి అనే విషయం తెలియకపోవచ్చని అంటున్నారు. కాగా ఈ విషయం ఆనోటా ఈనోటా పడి చివరికి అధికారుల దృష్టికి చేరింది.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి గర్భం వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే జైనాకు భర్త, కుమారుడు ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. నాలుగు నెలల క్రితం భర్తతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆమె మాజీ భర్తను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఈ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిడ్డకు జన్మనిచ్చిన సితి జైనాహ్ను.. ఆమెకు పుట్టిన బిడ్డను చూసేందుకు అధికారులతో పాటు జనాలు క్యూ కడుతున్నారు. అయితే సుడిగాలి ద్వారా గర్భం అంటూ ఈమె చెబుతున్నదంతా కట్టుకథ అని వైద్య అధికారులు భావిస్తున్నారు. కొంతమంది మహిళలకు క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వస్తుందని.. అంటే తాము గర్భం దాల్చినట్టు వారికి తెలియదని ప్రముఖ వైద్యుడు ఏమాన్ సులేమాన్ అంటున్నారు.

ఇక ఈ కేసు అందరినీ ఆశ్చర్యపరస్తున్నప్పటికీ ఇండోనేషియాలో గతంలో కూడా ఇటువంటి కేసులు నమోదయ్యాయని పోలీసుల వర్గాలు తెలుస్తోంది. న్యూస్ పోర్టల్ కోకోనట్‌ ప్రకారం.. గత ఏడాది జూలైలో ఇలాంటి కేసు వెలుగు చూసింది. 2017 లో కూడా ఓ కన్య  గర్భం దాల్చిన మూడు గంటల్లోనే శిశువుకి జన్మనిచ్చినట్లు తన కథనంలో పేర్కొంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top