
భారతీయ విద్యార్థుల వీసాలను నిర్దాక్షిణ్యంగా రద్దుచేస్తున్న ట్రంప్ సర్కార్
వాషింగ్టన్: చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘనలనూ సాకుగా చూపి విదేశీ విద్యార్థులకు బహిష్కరణ నోటీసులు ఇచ్చిన ట్రంప్ సర్కార్ నిర్దయగుణం ఇతర ఘటనల్లోనూ బయటపడుతోంది. ఇతర కేసుల్లో పొరపాటున ఇరుక్కుని ఎలాగోలా నిర్దోషులుగా బయటపడినా సరే అలాంటి విదేశీ విద్యార్థులనూ అమెరికా స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని కరాఖండీగా చెప్పేస్తోంది. ఇలా కఠిన నిబంధనల బారిన పడిన వారిలో భారతీయ విద్యార్థులూ ఉన్నారు.
ఇటీవల తన ప్రమేయంలేకున్నా ఒక కేసులో ఇరుక్కున్న ఒక భారతీయ విద్యార్థి ఎట్టకేలకు న్యాయస్థానంలో నిర్దోషిగా బయటపడ్డాడు. అయినాసరే గత నిందితుడు, నేరస్తుడు అని పేర్కొంటూ బహిష్కరణ నోటీసులిచ్చారు. అతని అమెరికా విద్యాభ్యాసానికి సంబంధించిన స్టూడెంట్ అండ్ ఎక్సే్ఛంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవీస్) రికార్డ్‌ను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటి విభాగ డేటాబేస్ నుంచి తొలగించారు. దీంతో తప్పనిసరిగా అమెరికాను వీడాల్సిన దుస్థితి దాపురించింది. ఇలా అనూహ్య అవస్థలు పడుతున్న భారతీయ విద్యార్థులు చాలా మంది ఉన్నారని తెలుస్తోంది.
ఇలా డిపోర్టేషన్ ఈ–మెయిల్ అందుకుని పరిష్కారం కోసం నా వద్దకు దాదాపు 30 మందికిపైగా భారతీయ విద్యార్థులు వచ్చారని పర్వతనేని చంద్ అనే ఒక వలసపరిష్కారాల న్యాయవాది చెప్పారు. లక్షలు ఖర్చుపెట్టి అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చిన భారతీయులు తమ చదువులను పూర్తిచేసుకోకుండానే తిరిగి వెళ్లాల్సిన అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సెవీస్ డేటాబేస్ అనేది విదేశీ విద్యార్థులకు సంబంధించింది. విద్యార్థులకు ఎఫ్–1 వీసా, వృత్తివిద్యా కోర్సులు చదివేవారికి ఎం–1 వీసా, ఇతర రకాల కోర్సులు, అంశాలతో సంబంధం ఉన్న వారికి జే–1 వీసాలు ఇస్తారు.
వీళ్లందరి డేటాను సెవీస్‌లో పొందుపరుస్తారు. ఉదాహరణకు ఒకవేళ సెవీస్‌లో ఒక విద్యార్థి డేటాను తొలగిస్తే అతను అమెరికాలో ఉండేందుకు అనర్హుడవుతాడు. అప్పుడు అతనికి రెండే దారులుంటాయి. ఒకటి మళ్లీ తన డేటాను పునరుద్ధరించుకునేందుకు న్యాయబద్ధంగా పోరాడాలి. లేదంటే 15 రోజుల్లోపు స్వీయబహిష్కరణ ద్వారా అమెరికాను వీడాలి. అప్పటికీ వెళ్లలేదంటే అమెరికా ప్రభుత్వం బలవంతంగా పంపేసి సుదీర్ఘకాలంపాటు మళ్లీ వీసారాకుండా అడ్డుకుంటుంది. స్టూడెంట్ వీసాదారులనేకాదు ఇటీవలికాలంలో గ్రీన్‌కార్డ్, తాత్కాలిక వర్క్ వీసాదారుల కార్యకలాపాలనూ అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పాలస్తీనా సానుభూతిపరులను సాగనంపిన విషయం విదితమే.
పాత కేసులనూ తవ్వితీసి..
లెరి్నంగ్ లైసెన్స్‌తో కారు నడిపి దొరికిపోతే జరిమానా విధిస్తారు. వాస్తవానికి అమెరికాలో శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే కారు నడపాలి. భారతీయ విదేశీ విద్యార్థులు ఇలా లెర్నింగ్ లైసెన్సుతో కారు నడిపి పోలీసులకు చిక్కిన ఉదంతాలను ఇప్పుడు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు బయటకు లాగుతున్నారు. పాత కేసులను తవి్వతీసి బహిష్కరణ నోటీసులిస్తున్నారు. గతంలోనే కొట్టేసిన, ఉపసంహరించుకున్న గృహహింస సంబంధ పాత కేసులనూ డిపోర్టేషన్‌కు వాడుకుంటున్నారు. ఇప్పుడా కేసు మనుగడలో లేదని వాదించినా అధికారులు వినిపించుకోవట్లేరు.
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా దానిని అమెరికాలో పరిగణించబోమని అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఒకరకంగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఆల్కాహాల్, డ్రగ్స్ వాడకున్నా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కేసునూ డిపోర్టేషన్‌కు ఆయుధంగా వాడుతున్నారు. పదేళ్ల క్రితం ఓ విద్యార్థి ఎయిర్‌పోర్ట్/నౌకాశ్రయం వద్ద అనుమతిలేకుండా ప్రవేశించాడని కేసు నమోదైంది. తర్వాత అతనికి చట్టబద్ధంగా వీసా రావడంతో కేసు పక్కనబెట్టారు. ఆ పాత కేసును ఇప్పుడు అధికారులు బయటకు తీసి ఆ వ్యక్తికి వీసా కష్టాలను పెంచారు. ఇలా ప్రతి అనవసర అంశాన్నీ విదేశీ విద్యార్థులను పంపించేందుకు అధికారులు దురి్వనియోగం చేస్తున్నారు.
కారణం చెప్పకుండా వీసా రద్దు అన్యాయం
‘‘ఇటీవల డార్ట్‌మౌత్ కాలేజీలో పీహెచ్‌డీ చదువుతున్న ఒక చైనా విద్యార్థి వీసా గడువును ప్రభుత్వం హఠాత్తుగా ముగించేసింది. అతను ఏ నిరసనలో పాల్గొనలేదు. సోషల్‌మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్ట్ పెట్టలేదు. ఎలాంటి నేరచరిత్ర లేదు. అయినాసరే కారణంలేకుండా వీసాను రద్దుచేశారు. దీంతో వెంటనే మేం కేసు వేశాం. విదేశీ విద్యార్థుల పట్ల ఇలాంటి ధోరణి అవాంఛనీయం’’అని న్యూ హ్యాంప్‌షైర్ అమెరికన్ సివిల్ లిబరీట్స్ యూనియన్(ఏసీఎల్‌యూ), షాహీన్ అండ్ గార్డన్ న్యాయసేవా సంస్థలు చెప్పాయి. ఇలాంటి ప్రభుత్వ పనికిమాలిన ప్రవర్తన కారణంగా ఆ చైనా విద్యార్థి పీహెచ్‌డీ కల చెదిరిపోయిందని ఏసీఎల్‌యూ డైరెక్టర్ గిలీస్ బిసోనెటీ ఆవేదన వ్యక్తం చేశారు.