చెన్నైతో ‘రాణి’కి అనుబంధం.. కమల్‌హాసన్‌ సినిమా షూటింగ్‌ చూడటానికి వచ్చి..

Queen Elizabeth 2 Special Connection with Chennai - Sakshi

రెండు సార్లు రాక 

ఎలిజబెత్‌ మృతికి ప్రముఖుల సంతాపం 

సాక్షి, చెన్నై: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌కు చెన్నైతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడికి ఆమె రెండు సార్లు వచ్చి వెళ్లారు. ఆమె మృతిపై సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. బ్రిటన్‌ను సుదీర్ఘ కాలం పాలించిన రాణిగా చరిత్రలోకి ఎక్కిన ఎలిజబెత్‌ గురువారం స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ కోటలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మరణ సమాచారంతో చెన్నైలోని బ్రిటీష్‌ రాయబార కార్యాలయం వద్ద అధికారులు నివాళులర్పించారు. తమ సంతాపం తెలియజేశారు. అలాగే, బ్రిటీష్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లలోనూ సంతాప కార్యక్రమాలు జరిగాయి. రాణి చిత్ర పటం వద్ద అంజలి ఘటించారు.  

ఎలిజబెత్‌తో కామరాజర్, కరుణానిధి.. ఎలిజబెత్‌తో కమలహాసన్‌ 

సంతాపం 
అత్యధిక కాలం రాణిగా అధికారంలో కొనసాగిన ఆమె లేరన్న సమాచారం దిగ్భ్రాందికి గురి చేసిందని స్టాలిన్‌ పేర్కొన్నారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆమెతో భేటీ అయిన జ్ఞాపకాలను గుర్తు చేశారు. రాణి ఎలిజబెత్‌ జీవితంలో ఎక్కువ కాలం  ప్రజలతో మమేకమయ్యారని వ్యాఖ్యానించారు. సినీ నటుడు , మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్‌ సంతాపం తెలిపారు. తన చిత్రం మరుద నాయగం షూటింగ్‌ కోసం ఆమె వచ్చారని గుర్తు చేశారు.

కామరాజర్‌తో కరచాలనం

ఇదిలా ఉండగా, రాణి ఎలిజబెత్‌ చెన్నైకు రెండు సార్లు వచ్చారు. ఆమె ఢిల్లీకి వచ్చినప్పుడల్లా చెన్నైకు వచ్చి వెళ్లారు. ఆ మేరకు చెన్నైతో ఆమెకు అనుంబంధం ఉంది. 1997లో ఎంజీఆర్‌ ఫిల్మ్‌నగర్‌లో కమలహాసన్‌ మరుదనాయగం చిత్రం షూటింగ్‌ను వీక్షించేందుకు ఆమె వచ్చారు. అప్పటి సీఎం కరుణానిధి, కమలహాసన్‌లతో ఎలిజబెత్‌ ఎక్కువ సేపు మాట్లాడారు. అయితే, ఈ చిత్రం షూటింగ్‌ నేటికి పెండింగ్‌లోనే ఉంది. అంతకు ముందు 1961లో చెన్నైకు వచ్చారు. అప్పటి తమిళనాడు గవర్నర్‌ విష్ణురాం, సీఎం కామరాజర్, మంత్రి భక్తవత్సలం ఆమెకు ఆహ్వానం పలికారు. తన కుమారుడి బర్తడే ఆ సమయంలో ఇక్కడే ఆమె జరిపినట్టు సమాచారం.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top