గాలిపటాలతో విద్యుత్‌ ఉత్పతి..!

Power generation with kites with new technology - Sakshi

సరి‘కొత్త’ విద్యుత్‌

వివిధ మార్గాల్లో విద్యుత్‌ ఉత్పత్తి విధానాలపై జరుగుతున్న పరిశోధనలు

గాలిపటాలతో విద్యుత్‌ ఉత్పతి చేస్తున్న స్కాట్లాండ్‌ వాసి

నైట్‌ క్లబ్‌లో డ్యాన్స్‌ చేసే వారి శరీర ఉష్ణోగ్రతలతో బ్రిటన్‌లో విద్యుత్‌

ఆధునిక యుగంలో మనిషి జీవితానికి, విద్యుత్‌కు ఉన్న అనుబంధం విడదీయలేనిది. క్షణం పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినా.. భరించలేని పరిస్థితి. పదుల సంఖ్యలో విద్యుత్‌ ఉపకరణాలు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న విద్యుత్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడుతోంది. బొగ్గు సంక్షోభం గతేడాది పలు దేశాలను చీకట్లోకి నెట్టేసింది. జల, సౌర, పవన, అణు, గ్యాస్‌ తదితర మార్గాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నా కూడా.. మనిషి అవసరాలకు సరిపోవడం లేదు. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తిని భారీగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి.
– సాక్షి, అమరావతి 

స్కాట్లాండ్‌కు చెందిన రాడ్‌.. గాలిపటాలతో విద్యుత్‌ను పుట్టించే సరికొత్త టెక్నాలజీని కనిపెట్టారు. గాలిమరల ద్వారా విద్యుత్‌ తయారు చేస్తున్నప్పుడు.. గాలి పటాల ద్వారా ఎందుకు విద్యుత్‌ తయారు చేయకూడదని ప్రశ్నించుకున్న ఆయన.. ‘ఫ్లయింగ్‌ టర్బైన్‌’ టెక్నాలజీని ఆవిష్కరించారు. గాలి పటాలు ఎగురుతున్నప్పుడు విడుదలయ్యే శక్తిని కింద ఉండే గ్రౌండ్‌ స్టేషన్‌ విద్యుత్‌గా మారుస్తుంది. ఈ పద్ధతిలో చాలా తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి. 10 కిలోమీటర్ల ఎత్తులోనూ గాలి పటాలు విద్యుత్‌ను జనరేట్‌ చేయగలవు. ఇవి నిరంతరం ఎగురుతూ ఉంటే ఒక ఇంటికి సరిపడే విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. వ్యవసాయం, పరిశ్రమలు, చేపలు పట్టుకునే పడవలు, ఫ్యాక్టరీలు ఇలా అనేక చోట్ల ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు.

క్లబ్‌లో కాళ్లు కదిపితే చాలు.. 
బ్రిటన్‌లోని ఒక నైట్‌ క్లబ్‌ సంస్థ.. తమ వద్దకు వచ్చి డ్యాన్స్‌ చేసే వారి శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా విద్యుత్‌ తయారు చేస్తోంది. ఈ విద్యుత్‌ను అవసరమైనప్పుడు వాడుకునేలా.. భద్రపరుచుకునే ఏర్పాటు కూడా చేసింది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా కాలుష్యాన్ని నియంత్రించి, వాతావరణ మార్పులను అరికట్టవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా ఏపీలో ఇప్పటికే చెత్త నుంచి కరెంటు తయారు చేసే విధానాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా మన రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిలో తేలియాడే ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బొగ్గు కొరత నుంచి బయటపడటం కోసం బ్లూ హైడ్రోజన్‌ను జపాన్‌ ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. జపాన్‌లోని టోక్యోలో బ్లూ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌తో వాహనాలు కూడా ప్రయోగాత్మకంగా నడిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top