న్యూయార్క్‌ నడిరోడ్డు మధ్యలో ఏంటి ఇది? ఇన్ని రోజులుగా.. | Massive Sinkhole In New York City’s Long Island City Sparks Safety Concerns After Repeated Repair Failures | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌ నడిరోడ్డు మధ్యలో ఏంటి ఇది? ఇన్ని రోజులుగా..

May 3 2026 5:04 AM | Updated on May 3 2026 12:01 PM

 pothole wreaking havoc on community

న్యూయార్క్ నగరం ప్రపంచంలో అత్యంత గొప్ప మహానగరాల్లో ఒకటి. ఆర్థిక, వ్యాపార, కళలు, వినోదం, సాంకేతికతకు ఇది కీలక కేంద్రంగా నిలుస్తుంది. భారీ భవనాలు ఉంటాయి.. ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రధాన మార్కెట్లు ఇక్కడ ఉన్నాయి. అటువంటి నగరాన్ని ఓ ఆరు అడుగుల గుంత భయపెడుతోంది. కొన్ని వారాలుగా దానికి పరిష్కారమే దొరకడం లేదు. దాన్ని కొందరు రాక్షస గుంత, నరక కూపంగానూ అభివర్ణిస్తున్నారు. ఎప్పుడు ఏ రోడ్డు ప్రమాదం జరుగుతుందో తెలియక భయపడుతున్నామని చెబుతున్నారు.

ఆ గుంత క్వీన్స్‌లోని లాంగ్ ఐలాండ్ సిటీ ప్రాంతంలో 41వ అవెన్యూ వద్ద, 23వ స్ట్రీట్‌ నుంచి 24వ స్ట్రీట్‌ మధ్య ఉంది. అది రోడ్డు మధ్యన ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలకు కూడా కారణమవుతోంది. అంత పెద్ద న్యూయార్క్‌ సిటీలో గుంతను పూడ్చలేకపోతున్నారా? అని అనుకుంటున్నారా? ఆ గుంతను మొదట పూడ్చారు.

అయినప్పటికీ, ఆ గుంతను పూడ్చిన తర్వాత కూడా ఆస్ఫాల్ట్ ప్యాచ్ (గుంత పూడ్చేందుకు వేసే తాత్కాలిక నల్ల పదార్థపు పొర) కొన్ని గంటల్లోనే మళ్లీ దిగజారడం ప్రారంభమైంది. గుంత మళ్లీ లోతుగా మారి ప్రమాదంగా మారింది. మొదటి చిన్నగా ఉన్న గుంత ఇప్పుడు.. అందులో కారు పడిపోయేంత పెద్దగా మారింది.

ఇటీవల కొలిచినప్పుడు ఈ గుంత పొడవు సుమారు 6 అడుగులుగా ఉంది. 5 అడుగుల వెడల్పు, దాదాపు 30 అంగుళాల లోతు ఉంది. ఏప్రిల్‌ 24న నగర సిబ్బంది ఆ గుంతను పూడ్చారు. కానీ, పరిసర ప్రాంత ప్రజలు చెప్పిన వివరాల ప్రకారం.. ఆస్ఫాల్ట్ ప్యాచ్ కొన్ని గంటల్లోనే దిగజారడం ప్రారంభమైంది. స్థానిక ప్రజలను దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైపొర పూడ్చితే లోపల బలం లేక మళ్లీ దిగజారుతుందని చెబుతున్నారు.

పెరుగుతున్న ప్రమాదాలు 
ఇటీవల ఒక పికప్ ట్రక్ డ్రైవర్‌ గుంతలో పడకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా.. పార్క్ చేసిన కారును ఢీకొట్టాడు. రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. న్యూయార్క్‌ నగర అధికారులు పన్ను చెల్లింపుదారుల నుంచి చాలా డబ్బు వసూలు చేస్తున్నారని, కానీ పనులు సరిగ్గా చేయడం లేదని ఆ ట్రక్‌ డ్రైవర్‌ అన్నాడు. ప్రతి రోజు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పాడు. నగర రవాణా విభాగం సిబ్బంది రెండుసార్లు వచ్చి ఫొటోలు తీసి తాత్కాలికంగా పూడ్చారని స్థానికులు చెప్పారు. అయినప్పటికీ ఆస్ఫాల్ట్ ప్యాచ్ కొన్ని గంటల్లోనే మళ్లీ దిగజారడం ప్రారంభమైందని అన్నారు.

స్థానిక వాచ్‌మన్‌ మొహమ్మద్ హసన్ ఆ గుంత గురించి చొరవచూపి.. మొదట ట్రాఫిక్ కోన్లు, పసుపు రంగులో హెచ్చరిక టేప్ పెట్టాడు. ఆ తర్వాత డ్రైవర్లు గమనించేలా గుంత చుట్టూ ఫ్లోరెసెంట్ ఆరెంజ్ రంగుతో స్ప్రే చేసి, ఎరుపు జెండాతో ఒక కర్రను పెట్టాడు. నగర అధికారులు ఒక గుంతను కూడా పూడ్చలేకపోపోయారని, తమ వాచ్‌మన్‌ ప్రజలను రక్షించేందుకు ముందుకు వచ్చాడని స్థానిక వ్యక్తి ఒకరు చెప్పారు.

ఇటీవల జరిగిన ప్రమాదం తర్వాత స్థానికులు రోడ్ బ్యారికేడ్‌ను గుంత ముందు పెట్టారు. రవాణా విభాగం చేసిన ప్యాచ్ నిలవడం లేదని, గుంత ఇంకా ప్రమాదకరంగానే ఉందని స్థానికులు అన్నారు. తాత్కాలిక పరిష్కారం కాకుండా, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ గుంతను పూడ్చడంలో అధికారుల వైఫల్యం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. “ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇది రోడ్డులో మధ్యలో ఉంది. అది కనిపించడం కష్టం. ముఖ్యంగా రాత్రి పూట” స్థానిక వ్యక్తి ఒకరు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement