మారని పాక్‌ బుద్ధి: వ్యాక్సిన్‌ కూడా చైనాదే

Pakistan Approve Chinese Vaccine - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పక్కదేశం పాకిస్తాన్‌ వైఖరి ఏమీ మారడం లేదు. ప్రతి అంశంపై చైనాపై ఆధారపడుతోంది. తాజాగా కరోనా వ్యాక్సిన్‌ విషయంలో కూడా చైనాకు అనుకూల నిర్ణయం తీసుకుంది. చైనా అభివృద్ధి చేసిన ‘సినోఫామ్‌ వ్యాక్సిన్’కు పాకిస్తాన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి జారీ చేసింది. పాకిస్తాన్‌ డ్రగ్‌ నియంత్రణ సంస్థ ఈ వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వడంతో ఇక దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి పాకిస్తాన్ అనుమతిచ్చింది. తాజాగా చైనాకు సంబంధించిన వ్యాక్సిన్‌కు కూడా అనుమతి ఇవ్వడం విశేషం. అయితే చైనా విషయంలో పాక్‌ వైఖరి మారడం లేదు.

ప్రపంచ దేశాల నుంచి తిరస్కరణలు ఎదురవుతున్నా.. సైనిక, ఆర్థిక రంగాల్లో తనకు సహకరిస్తున్న చైనాకు పాక్‌ వత్తాసు పలుకుతోంది. దానికి పరిహారంగా నిధులు పొందుతోంది. అయితే ఇటీవల ఈ వ్యాక్సిన్‌పై ఆ దేశానికి చెందిన ఓ వైద్యుడు సంచలన ఆరోపణలు చేశారు. ‘చైనా అభివృద్ధి చేసిన కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ సినోఫామ్‌ ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైనది. దీని వల్ల 73 సైడ్‌ ఎఫెక్ట్‌లు కలుగుతున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రాంతంలో విపరీతమైన నొప్పి, బీపీ పెరగడం, చూపు కోల్పోవడం, తల నొప్పి, మూత్ర సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాక్సిన్‌ వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతున్నాయి’ అని తెలిపాడు. మరి అలాంటి వ్యాక్సిన్‌కు పాకిస్తాన్‌ అనుమతి ఇవ్వడం గమనార్హం. పాకిస్తాన్‌లో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5,21,211. కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 10,997 మంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top