స్కూల్లో భారీగా భయానక ఆయుధాలు.. ఇంతటి డేంజర్‌లో.. | over 130 Hezbollah weapons inside Lebanon school | Sakshi
Sakshi News home page

స్కూల్లో భారీగా భయానక ఆయుధాలు.. ఇంతటి డేంజర్‌లో..

Apr 16 2026 7:28 PM | Updated on Apr 16 2026 8:05 PM

over 130 Hezbollah weapons inside Lebanon school

టెల్ అవీవ్: పిల్లలు చదువుకునే స్కూల్లో ఏముంటాయి? స్కూల్‌ బ్యాగులు, పుస్తకాలు, వాళ్లు కూర్చునేందుకు బెంచీలు వంటివి ఉంటాయి. అయితే, ఓ స్కూల్లో మాత్రం 130కి పైగా భయానక ఆయుధాలు కనపడ్డాయి. లెబనాన్‌లోని బింట్ జ్బైల్ ప్రాంతంలోని ఓ స్కూల్లో హెజ్బొల్లాకు చెందిన ఈ ఆయుధాలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) గుర్తించాయి.

కలాష్నికోవ్ తుపాకులు, పిస్టళ్లు, ఇతర ఆయుధాలు ఉన్నాయని ఐడీఎప్‌ ఎక్స్‌లో పేర్కొంటూ వాటి ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఐడీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుధాలతో పాటు హెజ్బొల్లా జెండాలు, ఇతర ఉగ్రవాద సంస్థల గుర్తులు కూడా అక్కడ కనపడ్డాయి.

ఇదే సమయంలో ఐడీఎఫ్ మరో ప్రకటనలో.. కేవలం ఒక నిమిషంలో సుమారు 70 హెజ్బొల్లా మౌలిక వసతులను ధ్వంసం చేశామని తెలిపింది. డజన్ల కొద్దీ ఆయుధాలను గుర్తించామని తెలిపింది. అందులో ఆర్‌పీజీలు, కలాష్నికోవ్ తుపాకులు, మందుగుండు సామగ్రి, గ్రెనేడ్లు, స్పై డివైజ్‌లు, ఇతర యుద్ధ సామగ్రి ఉన్నాయి.

మరో ఆపరేషన్‌లో పదులకొద్దీ ఉగ్రవాదులను హతమార్చినట్టు పేర్కొంది. ఇదిలా ఉండగా హెజ్బొల్లా ఇంతకు ముందు ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలపై రెండు డ్రోన్ దాడులకు బాధ్యత వహించింది. నహారియా సమీపంలో ఇజ్రాయెల్ సైన్య స్థావరాలపై డ్రోన్ దాడులు జరిగాయి.

ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లాపై లక్ష్యిత దాడులు కొనసాగుతున్నాయని, దీర్ఘకాల శాంతి దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

కాగా, ఓ వైపు చర్చలు జరుపుతూనే మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు జరుపుతోంది. ఇరు దేశాలు మూడు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి ఇప్పుడు అమెరికాలో దౌత్య చర్చలు నిర్వహించాయి. ఈ రెండు దేశాల మధ్య చివరిసారిగా ప్రత్యక్ష చర్చలు 1993లో జరిగాయి. ఇరాన్‌ మద్దతు ఉన్న హిజ్బుల్లా ఇటీవల రాకెట్లను ప్రయోగించింది. ఉత్తర ఇజ్రాయెల్ నివాస ప్రాంతాలపై ఈ దాడులు జరిపింది. అదే సమయంలో, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లో దాడులు జరిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement