రాజభోగాలు వదులుకుని.. ఆయన వెంట వెళ్లిపోయిన యువరాణి!

Norway Princess Gives Up Royal Duties To Focus On Business - Sakshi

ఓస్లో: అంతులేని వైభోగాలు.. నిత్యం వెన్నంటి ఉండే మందీమార్బలం.. సపర్యలు చేసి పెట్టడానికి వందల మంది సిబ్బంది.. ఇవన్నీ ఎవరు వదులుకుంటారు? కానీ, కొద్ది నెలల క్రితం బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ.. రాజరికాన్ని వదులుకుని అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసింది. అదే దారిలో నార్వే యువరాణి మార్థా లూయీస్‌ నడిచారు. తన రాచరికాన్ని వదులుకుంటున్నట్లు మంగళవారం సంచలన ప్రకటన చేశారు.

తనకు కాబోయ భర్తతో కలిసి ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ హాలీవుడ్‌ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్‌-అమెరికన్‌ ఆరవ తరం షమన్‌ అయిన డ్యూరెక్‌ వెరెట్‌తో 51 ఏళ్ల యువరాణి మార్థా లూయీస్‌ ప్రేమలో ఉన్నారు. అయితే, షమన్‌తో యువరాణి అనుబంధం కారణంగా 17 శాతం మంది నార్వేయన్లు రాయల్‌ కుటుంబంపై వ్యతిరేకతతో ఉన్నట్లు గత సెప్టెంబర్‌లో జరిగిన ఓ పోల్‌ వెల్లడించింది.

మరోవైపు.. ‘రాయల్‌ కుటుంబంలో ప్రశాంతతను తీసుకొచ్చేందుకు నేను తప్పుకుంటున్నాను’ అంటూ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు యువరాణి మార్థా లూయిస్‌. 

నార్వే రాజు ప్రకటన.. 
మరోవైపు.. రాయల్‌ ప్యాలెస్‌ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. యువరాణి తన రాజరికాన్ని వదులుకుంటున్నారని, ఇకపై ఆమెకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేసింది. అయితే, రాజు కోరిక మేరకు ఆమె యువరాణిగా పిలవబడతారని తెలిపింది. యువరాణి మార్థా ప్రకటన తర్వాత రాణి సంజాతో కలిసి మీడియాతో మాట్లాడారు నార్వే రాజు హరాల్డ్‌. యువరాణి రాయల్‌ కుటుంబానికి ఇకపై ప్రాతినిధ్యం వహించదని చెప్పేందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. తన నిర్ణయంపై ఆమె ఎంతో స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. 

ఇప్పటికే వివాహం.. ముగ్గురు పిల్లలు..
దేవదూతలతో మాట్లాడగలనని చెప్పుకునే మార్థా లూయిస్‌కు ఇప్పటికే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన‍్నాయి. అయితే, ఆమె తన భర్త అరిబెన్‌తో విడిపోయారు. 2002లో క్లైర్‌ వాయెంట్‌గా పని చేసేందుకు సిద్ధమైన క్రమంలో ‘హర్‌ రాయల్‌ హైనెస్‌’ అనే టైటిల్‌ను కోల్పోయారు. మరోవైపు.. 2019లో తన వ్యాపారాల విషయంలో ప్రిన్సెస్‌ టైటిల్‌ను ఉపయోగించబోనని అంగీకరించారు. గత జూన్‌లో షమన్‌ వెరెట్‌తో అనుబంధం ఏర్పడిన క్రమంలో వారు ప్రత్యామ్నాయ థెరపీలపై దృష్టిసారించారు. సోషల్‌ మీడియా వేదికగా వాటిపై విస్తృత ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను కీలక బాధ్యతల నుంచి తప్పించాయి పలు హెల్త్‌కేర్ గ్రూప్‌లు.

ఇదీ చదవండి: హ్యారీకి అవమానం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top