కరోనాపై 222 రోజుల పోరాటం

Longest Fight Against Coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌లో ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడి మత్యువుతో పోరాడి బయట పడిన శతాధిక వద్ధులు పలువురు ఉన్నారు. కరోనా కోరల్లో చిక్కుకుని మత్యువుతో 180, 179 రోజుల పాటు పోరాడి ప్రాణాలతో బయట పడిన వారూ ఉన్నారు. కానీ క్యాబ్‌ డ్రైవర్, పోకర్‌ ప్లేయరయిన అలీ సకాల్లియోగ్లూ లాగా సుదీర్ఘకాలం పాటు మత్యువుతో పోరాడి అంతిమంగా కరోనాపై విజయం సాధించి ఇంటికి తిరిగొచ్చిన వారు ఎవరూ లేరట.  56 ఏళ్ల అలీ ఏకంగా 222 రోజులపాటు కరోనాతో పోరాడి మత్యువు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో వెనక్కి రావడం వైద్య చరిత్రలో ఓ అరుదైన అధ్యాయం అవుతుందని ఆయనకు చికిత్స అందించిన ఆస్పత్రి వర్గాలు వ్యాఖ్యానించాయి. ఆయన ఆస్పత్రిలో ఉండగానే ఓ సారి గుండెపోటుకు గురయ్యారు. ఓసారి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి. చివరకు ఆయన శరీరంలోని పలు అవయవాలు కూడా పని చేయకుండా పోయాయి. ప్రధానంగా మూడుసార్లు ఆయన మత్యు ముఖందాకా వెళ్లి వచ్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆగ్నేయ లండన్‌లోని క్యాట్‌ఫోర్డ్‌కు చెందిన అలీ టైప్‌ వన్‌ డయాబెటిసీతో బాల్యం నుంచి బాధ పడుతున్నారు. ఆయన గత మార్చి నెలాఖరులోనే కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఆయన కరోనా కేసులకు సంబంధించి బ్రిటన్‌ ప్రభుత్వం సూచించిన 111 నెంబర్‌కు ఫోన్‌ చేసి సహాయం అర్థించారు. ఆయన్ని వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. అలీ అలాగే చేశారు. ఏప్రిల్‌ నెల నాటికి ఆయన రోగ లక్షణాలు మరీ తీవ్రమయ్యాయి. ఆయన్ని లండన్‌లోని లెవిశ్యామ్‌ యూనివర్శిటీ హాస్పటల్‌కు తరలించారు. అక్కడ ఆయన పరిస్థితి పరిశీలించి వైద్యులు వెంటనే ఆయనకు ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ అమర్చారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది. రెండు, మూడు రోజలకే ఆయనకు అక్కడ గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత ఆయన్ని సోమర్‌సెట్‌లోని వెస్టన్‌ జనరల్‌ హాస్పటల్‌కు తరలించి అక్కడ ఆయన గుండెకు ఆపరేషన్‌ చేశారు. ఆ సమయంలో అలీకి విశ్రాంతి కోసం కోమా డ్రగ్‌ ఇచ్చారు.

అలా మూడు నెలలపాటు కోమాలో ఉన్న ఆయన్ని స్పహలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. ఊపరితిత్తులు పాడయ్యాయి. వాటికి చికిత్స అందిస్తుండగానే ఆయన శరీరంలోని పలు అవయవాలు పని చేయడం మానేశాయి. ఆయన ఆరోగ్యం నిలకడ స్థితికి వచ్చాక ఆయన్ని నర్సింగ్‌ హోమ్‌కు తరలించారు. అక్కడ రోజువారి శిక్షణ ద్వారా ఆయన ఎప్పటిలాగా కూర్చోవడం, నడవడం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన ‘రిమెంబ్రెన్స్‌ డే (మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన రోజు)’ నాడు అంటే, నవంబర్‌ 11వ తేదీన క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారు. మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల్లో బ్రిటీష్‌ అలీన దళాలు ఎలా గెలిచాయో, తాను కరోనాపై జరిగిన పోరాటంలో గెలిచానని అలీ ‘ది సన్‌’ పత్రికతో అలీ సగౌరవంగా వ్యాఖ్యానించారు.

కుటుంబ పోషణార్థం తాను మళ్లీ క్యాబ్‌ డ్రైవర్‌గా వెళ్లాలనుకుంటున్నానని భార్య, ముగ్గురు ఆడపిల్లలు, తొమ్మిది మంది మనమలు మనమరాళ్లు కలిగిన అలీ తెలిపారు. మూడు ఆస్పత్రులు తిరిగి ఎన్నో వైద్య సేవలు అందకున్న అలీకి చేతి నుంచి ఒక్క పైసా ఖర్చు కాకపోవడం ‘నేషనల్‌ హెల్త్‌ స్కీమ్‌’ కింద బ్రిటన్‌ అందిస్తోన్న వైద్య సేవలను ప్రశంసించకుండా ఉండలేం. ఓ క్యాబ్‌ డ్రైవర్‌కు కూడా అక్కడి ఆస్పత్రులు ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చాయో అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్‌లో గత నెలలో కరోనా బారిన పడిన 58 ఏళ్ల మార్క్‌ గ్రెగరి 180 రోజులపాటు మత్యువుతో పోరాడి విజయం సాధించగా, 63 ఏళ్ల అనిల్‌ పటేల్‌ 179 రోజులపాటు పోరాడి గెలిచారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top