నర్గీస్‌ మొహమ్మదీ ఆరోగ్యం విషమం! | Iran Nobel laureate Narges Mohammadi hospitalised as health deteriorates | Sakshi
Sakshi News home page

నర్గీస్‌ మొహమ్మదీ ఆరోగ్యం విషమం!

May 3 2026 6:24 AM | Updated on May 3 2026 6:24 AM

Iran Nobel laureate Narges Mohammadi hospitalised as health deteriorates

టెహ్రాన్‌కు తరలించడానికి అనుమతి ఇవ్వని ఇరాన్‌ ప్రభుత్వం 

టెహ్రాన్‌: ఇరాన్‌కు చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీత నర్గీస్‌ మొహమ్మదీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమెను శుక్రవారం రాత్రి జైలు నుంచి వాయువ్య ఇరాన్‌లోని జంజాన్‌ ఆసుపత్రికి తరలించారు. మొహమ్మదీ ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారినట్లు ఆమె ఫౌండేషన్‌ వెల్లడించింది. రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు, తీవ్రమైన వికారం వంటి సమస్యలతో మొహమ్మదీ బాధపడుతున్నారు. 

మెరుగైన చికిత్స కోసం ఆమెను రాజధాని టెహ్రాన్‌కు తరలించాలని జంజాన్‌ ఆసుపత్రి వైద్యులు సూచించారు. యాంజియోగ్రఫీ చేయాల్సి ఉందని చెప్పారు. అయితే, మొహమ్మదీని టెహ్రాన్‌కు తరలించడానికి ఇరాన్‌ ప్రభుత్వం అంగీకరించలేదని ఆమె భర్త తాఘీ రెహ్మానీ తెలిపారు. యాంజియోగ్రఫీ పూర్తయ్యే వరకు తన భార్య ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించలేమని పేర్కొన్నారు. పారిస్‌లో ఉన్న రెహ్మానీ ఈ మేరకు ఒక సందేశాన్ని మీడియా ద్వారా విడుదల చేశారు. 

హెచ్చుతగ్గులకు గురవుతున్న రక్తపోటుకు వైద్యులు చికిత్స చేయలేకపోతున్నారని మొహమ్మదీ సోదరుడు హమీద్రేజా మొహమ్మదీ వెల్లడించారు. తన సోదరి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. నర్గీస్‌ మొహమ్మదీ ఇరాన్‌లో మానవ హక్కుల పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. లాయర్‌గా, జర్నలిస్టుగా పనిచేశారు. ఇరాన్‌ ప్రభుత్వంపై ఆమెపై కేసులు బనాయించింది. పలుమార్లు జైలుకు పంపించింది. మొహమ్మదీ 2023లో నోబెల్‌ శాంతి బహుమతి పొందారు. ఓ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఆమెకు ఏడున్నరేళ్ల జైలుశిక్ష పడింది. అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నారు.

గూఢచర్యం ఆరోపణలతో ఇద్దరికి ఉరిశిక్ష 
ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని ఇరాన్‌ ప్రభుత్వం ఉరితీసింది. యాగూబ్‌ కరీంపూర్, నాసర్‌ బెక్రజాదే అనే ఈ ఇద్దరు ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొసాద్‌కు రహస్య సమాచారం చేరవేస్తూ దొరికిపోయారని పేర్కొంది. నేరం రుజువు కావడంతో కింది కోర్టు వారికి మరణశిక్ష విధించినట్లు తెలిపింది. 

మరణశిక్ష విధించడాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించడంతో ఉరిశిక్ష అమలు చేసినట్లు వెల్లడించింది. అలాగే ప్రభుత్వ, మత పెద్దల వివరాలతో పాటు నతాంజ్‌ అణు కేంద్రం గురించి సమాచారాన్ని పంపినట్లు రుజువులు ఉన్నాయని తెలియజేసింది. గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణల కింద ఇరాన్‌ ప్రభుత్వం ఇటీవలి కాలంలో దాదాపు 25 మందిని ఉరితీసింది. ప్రభుత్వ తీరుపై మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. నిందితుల వాదన వినకుండానే, నేరం రుజువు కాకుండానే ఉరిశిక్ష అమలు చేస్తోందని ఆరోపిస్తున్నాయి.                                         

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement