కాల్పుల విరమణపై సందేహాలు!  | Iran and USA exchange fire in strait of Hormuz | Sakshi
Sakshi News home page

కాల్పుల విరమణపై సందేహాలు! 

May 10 2026 4:44 AM | Updated on May 10 2026 10:25 AM

Iran and USA exchange fire in strait of Hormuz

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు 

అమెరికా తీరుపై భగ్గుమంటున్న ఇరాన్‌  

దుబాయ్‌:  అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు ఇరాన్‌ చమురు ట్యాంకర్లపై అమెరికా శుక్రవారం దాడికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా తీరుపై ఇరాన్‌ భగ్గుమంటోంది. ప్రతిదాడులకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. 

ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న రెండు ఇరాన్‌ ట్యాంకర్లపై తమ బలగాలు దాడి చేశాయని అమెరికా సైన్యం తెలిపింది. అంతకుముందు తమ నౌకలపై జరిగిన దాడులను తిప్పికొట్టామని, జలసంధిలోని ఇరాన్‌ సైనిక స్థావరాలపై దాడి చేశామని ప్రకటించింది. మరోవైపు ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 41 మందిని అరెస్టు చేసినట్లు బహ్రెయిన్‌ శనివారం ప్రకటించింది. 

పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడం, హార్మూజ్‌ జలసంధిని నౌకాయానానికి వీలుగా తిరిగి తెరవడం, వివాదాస్పద అణు కార్యక్రమాన్ని టెహ్రాన్‌ ఉపసంహరించుకోవడంపై ఒప్పందం కోసం అమెరికా చేసిన తాజా ప్రతిపాదనపై ఇరాన్‌ఇంకా స్పందించలేదు. కొన్ని అంశాలపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెబుతోంది. అణు కార్యక్రమం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సంకేతాలిస్తోంది. కాల్పుల విరమణ కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్నప్పటికీ.. ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్‌పై బాంబు దాడులను పునఃప్రారంభిస్తామని ఆయన స్పష్టంచేయడం గమనార్హం.

 మరోవైపు అమెరికా మద్దతుగా నిలుస్తున్న బహ్రెయిన్‌కు ఇరాన్‌ హెచ్చరికలు జారీ చేసింది. ‘‘అమెరికాకు వత్తాసు పలకడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. హార్మూజ్‌ జలసంధి ఒక కీలకమైన జీవనాధారం. దానిని మీ అంతట మీరే శాశ్వతంగా మూసివేసే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దు’’అంటూ ఇరాన్‌ పార్లమెంట్‌ జాతీయ భద్రతా కమిషన్‌ అధిపతి ఇబ్రహీం అజీజీ తేల్చిచెప్పారు. పశ్చిమాసియాలో ఘర్షణలు ముగిసిన తర్వాత హార్మూజ్‌లో తమ నౌకలను రక్షించుకోవడానికి యుద్ధనౌకను పంపించనున్నట్లు బ్రిటన్‌ రక్షణశాఖ ప్రకటించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement